2019 ఎన్నికల తరువాత ఓటమితో కృంగిపోయిన పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో నూతన ఉత్సహం నింపడానికి చంద్రబాబు నాయుడు టీడీపీ యొక్క రాష్ట్ర పగ్గాలను అచ్చెన్నాయుడుకి అప్పగించారు. దీంతో పతనావస్థకు చేరువలో ఉన్న టీడీపీకి అచ్చెన్న తిరిగి ప్రాణం పోస్తాడని అందరు భావించారు. కానీ అచ్చెన్న పనితనం పంచాయతి ఎన్నికల్లో బయట పడింది. ఆయన వల్ల పార్టీకి ఎదో లాభం జరుగుతుందనిభావించిన వారందరిని అచ్చెన్న నిరాశపరిచారు.
నిమ్మాడకే పరిమితం
అచ్చెన్నకు పార్టీ భాధ్యతలు అప్పగించిన తరువాత ఏపీ మొత్తాన్ని కదిలించకపోయినా ఉత్తరాంధ్రా జిల్లాల వరకైనా సైకిల్ జోరు చేస్తే చాలు అనుకున్నారు. కానీ ఉత్తరాంధ్రాలో మాత్రం పసుపు శిబిరంలో పరవశాన్ని అచ్చెన్న తేలేకపోతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా అచ్చెన్నాయుడు ప్రభావం అంతా తన సొంత గ్రామం నిమ్మాడ వరకే పరిమితం అంటున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో టెక్కలి పంచాయతీ వైసీపీకి జై కొట్టి ఏకగ్రీవంగా జెండా ఎత్తేసింది. మరో వైపు టెక్కలిలో వైసీపీ బలమైన రాజకీయ ప్రత్యర్ధిగా మారుతోంది.
బీసీలు కూడా కలిసి రావడం లేదా!!
ఉత్తరాంధ్రాలో పెద్ద బీసీ అయిన అచ్చెన్నకు పట్టం కట్టాం కాబట్టి బీసీలు మొత్తమంతా మన వైపే అని చంద్రబాబు అనుకున్నట్లుగా కధ సాగడంలేదు. వైసీపీ ప్రభుత్వం వాళ్ళ కోసం చేస్తున్న కార్యక్రమాలను చూసిన జనం ఇంకా జగన్ కే పట్టం కడుతున్నారు. కాపు వర్గానికి చెందిన వారు బీజేపీ- జనసేనకు, బీసీలు వైసీపీకి మద్దతు ఇస్తుండటం వల్ల టీడీపీ పూర్తిగా పతనావస్థకు చేరుకుంది. అచ్చెన్న వల్ల పార్టీలో ఎదో అద్భుతాలు జరుగుతాయని భావించిన వారిని అచ్చెన్న నిరాశపరిచారు. రానున్న రోజుల్లో అచ్చెన్న ఎలా వ్యవహరిస్తారో చూడాలి.