Chandrababu : చంద్రబాబు చేతిలో వైసీపీ అసంతృప్త నేతల లిస్ట్.!

Chandrababu : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. వైఎస్ జగన్ మంత్రి వర్గ విస్తరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీలో తలెత్తే అసంతృప్త సెగల్ని క్యాష్ చేసుకోవాలన్నది చంద్రబాబు వ్యూహం. అసంతృప్త నేతలెవరన్నదానిపై చంద్రబాబు ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చారనీ, ఆయా నేతలతో చంద్రబాబు సన్నిహితులు మంతనాలు కూడా షురూ చేశారన్న ప్రచారం జరుగుతోంది.
ప్రధానంగా పలువురు మంత్రులు, వైఎస్ జగన్ తీరు పట్ల అసంతృప్తితో వున్నారట. మంత్రులుగా పని చేస్తున్నా తమ శాఖలపై పెత్తనం తమకు కాకుండా, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలోనే ఆ పెత్తనం వుందన్నది సదరు మంత్రుల ఆవేదన అట.
సకల శాఖల మంత్రిగా సజ్జల రామకృష్ణా రెడ్డి గురించి తరచూ రాజకీయ సెటైర్లు వినిపిస్తుంటాయ్. అవి నిజమేనంటూ పలువురు మంత్రులు, చంద్రబాబు సన్నిహితుల వద్ద చెప్పుకొస్తున్నారట.
అయితే, ఇదంతా టీడీపీ మార్కు మైండ్ గేమ్ అనీ, వైసీపీ నుంచి ఎవరూ టీడీపీ వైపు వెళ్ళే అవకాశమే లేదని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. దాదాపు అందరు మంత్రులూ పదవులు కోల్పోయే అవకాశం వున్నా, దానికి వారెవరూ చింతించడంలేదన్నది వైసీపీ ముఖ్య నేతల వాదన.
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. రాజకీయాల్లో పదవులే పరమావధి. ఆ పదవుల కోసమే నాయకులు ఏదైనా చేస్తారు. సో, మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ దెబ్బకి వైసీపీలో అలజడి రేగడమైతే ఖాయమే.