మందు బాబులు.. కరోనా భూతాన్ని అస్సలు లెక్క చేయం.!

Liquor Babus: Never Ever Care About Covid 19

Liquor Babus: Never Ever Care About Covid 19

‘మేం మద్యానికి బానిసం కాదు.. మేం నిఖార్సయిన ట్యాక్స్ పేయర్స్..’ అంటాడు ఓ సినిమాలోని కమెడియన్. దేశం బాగు కోసం తన ప్రాణాన్ని లెక్క చేయకుండా, నిత్యం మద్యాన్ని సేవిస్తుంటాడు సదరు ట్యాక్స్ పేయర్. సినిమాలో కాబట్టి కామెడీ బాగా పేలింది. కానీ, వాస్తవంలోకి వస్తే.. సదరు ట్యాక్స్ పేయర్.. జనాభా నియంత్రణ కోసం కూడా నడుం బిగించినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే, మద్యం సేవించి.. వాహనాలు నడిపి.. ఎంతోమంది ప్రాణాల్ని తీస్తుంటాడీ ట్యాక్స్ పేయర్. మహిళలపై అఘాయిత్యాలు చేసి, ఆ రకంగా కూడా సంచలనాలకు కారణమవుతాడీ ట్యాక్స్ పేయర్. సిగ్గుండాలి.. ట్యాక్స్ పేయర్ అనే మాటని ఉపయోగించడానికి.. అన్పిస్తే, అది మీ తప్పు కానే కాదు. సరే, కొందరికి మద్యాన్ని సేవించే అలవాటు వుంటే వుండొచ్చుగాక. అందరూ దేశాన్ని నాశనం చేసేస్తున్నారని అనలేం. కొందరు మాత్రం, తెలిసో తెలియకో.. దేశాన్ని నాశనం చేసేస్తున్నారు మద్యానికి బానిసలైపోయి.

కరోనా నేపథ్యంలో ‘లాక్ డౌన్’ తప్పడంలేదు. ఈ ‘లాక్ డౌన్’ భయాలతో మందుబాబులు ముందుగానే అలర్ట్ అయిపోయి, మద్యం దుకాణాల వద్ద బారులు తీరేయడం గత ఏడాదీ చూశాం.. ఇప్పుడూ చూస్తున్నాం. మారరా.? వీళ్ళసలు మారరా.? మద్యం దుకాణాలు, బార్లు.. కరోనా సూపర్ స్ప్రెడర్స్ అయిపోతున్నా మారరా.? మారరుగాక మారరు. ప్రభుత్వాలకీ మద్యం ప్రియులంటే మహా ఇష్టం. వీళ్ళు తాగి, ఊగి, పడిపోతేనే కదా.. ప్రభుత్వాలకి మద్యం ద్వారా మాంఛి ఆదాయం లభించేది. డ్రంక్ అండ్ డ్రైవ్ చలానాలు ప్రభుత్వానికి ఏ స్థాయిలో ఆదాయాన్ని అందిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని వుందంటారా.? రోజంతా కష్టపడటం, సాయంత్రమైతే.. ఆ కష్టాన్నంతా మద్యం కోసం ఖర్చు చేసెయ్యడం.. మిగిలింది డ్రంక్ అండ్ డ్రైవ్ చలానాలకి కట్టేయడం.. అన్నట్టు తయారైంది పరిస్థితి. యుద్ధ విమానాల్లో, యుద్ధ నౌకల్లో ఆక్సిజన్, మెడిసిన్స్, వ్యాక్సిన్స్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినా, మందుబాబులు మారరుగాక మారరంతే.