Lavanya Tripati : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే సినీ సెలబ్రిటీలలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా ఒకరు. పైగా, తన మీద ఎవరన్నా ట్రోలింగ్ చేసినా, వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా లావణ్య వెంటనే చాలా తీవ్రంగా స్పందిస్తుంటుంది. స్పాంటేనిటీ విషయంలో లావణ్య తర్వాతే ఎవరైనా.. అని పలు సందర్భాల్లో నిరూపితమయ్యింది కూడా.
కానీ, లావణ్య ఇప్పుడు సైలెంటయిపోయింది. వరుణ్ తేజ్ – లావణ్య పెళ్ళంట.. అంటూ సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో పుకార్లు బయల్దేరాయి. పాతిక లక్షల విలువైన డైమండ్ రింగుతో వరుణ్ తేజ్, లావణ్య వద్దకు వెళుతున్నాడంటూ వరుణ్ పుట్టనిరోజున పుకార్లు పుట్టించేశారు కొందరు.
వామ్మో, సినిమా స్టోరీల కంటే దారుణం ఇవి. అంత పక్కాగా కథనాలు అల్లేశారు. మెగా కాంపౌండ్ ఈ విషయమై స్పందించలేదు, ఇలాంటి విషయాల్ని పెద్దగా పట్టించుకోదు కూడా. కానీ, లావణ్య అలా కాదు కదా. తన మీద వచ్చే నెగెటివ్ వార్తల్నీ, గాసిప్స్‌నీ ఖండిస్తుంటుంది.
వరుణ్, లావణ్య కలిసి ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాల్లో నటించారు. అలా ఇద్దరి మధ్యా సినీ స్నేహం పెరిగి వుండొచ్చుగాక. నిహారిక పెళ్ళిలోనూ లావణ్య సందడి చేసింది. అన్నట్టు, లావణ్య గతంలో అల్లు శిరీష్‌తో కూడా ఓ సినిమా చేసింది. సినీ రంగంలో స్నేహాలు మామూలే. అలాగని అన్ని స్నేహాలూ ఆ తర్వాత ప్రేమగా మారతాయని, పెళ్ళి పీటలెక్కిస్తాయని అనగలమా.?
నిప్పు లేకుండా పొగరాదన్నది వెనకటి మాట. కానీ, ఇప్పుడు పొగ రావడానికి నిప్పుతో పనే లేదు. కానీ, లావణ్య సైలెన్స్ మాత్రం కొన్ని అనుమానాలకు తెరలేపుతోంది.