స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎంతో ఆవేదన, ఆక్రందన చెందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ములాకత్ లో చంద్రబాబును జైల్లో కలిశారు. అనంతరం జైలు బయటకు వచ్చి మీడియాను అడ్రస్ చేశారు. ఆ సమయంలో పొత్తు ప్రకటించారు. అయితే అది జరిగి సుమారు నెలరోజులు కావొస్తున్నా… నెక్స్ట్ స్టెప్ పడలేదు. అడిగితే సాకులు చెబుతున్నారని అంటున్నారు!
అవును… టీడీపీతో పవన్ కళ్యాణ్ అధికారికంగా పొత్తు ప్రకటించి నెల రోజులు కావొస్తున్నా.. ఇప్పటి వరకూ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా ఉద్భవించిన ఈ పొత్తుపై.. త్వరలోనే రెండు పార్టీలు సమావేశమై జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తాయని పవన్ కల్యాన్ చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే పొత్తు, సీట్ల పంపకంపై క్లారిటీ ఇస్తామని కూడా చెప్పుకొచ్చారు. అనంతరం… సైలెంట్ అయిపోయారు.
అయితే ఈ ఉమ్మడి కార్యచరణ విడుదలైతే అటు టీడీపీ కేడర్ లో కూడా కాస్త కదలికలు వస్తాయని.. ఎవరికి టిక్కెట్ కన్ ఫాం, ఎవరికి హ్యాండ్ అనే విషయాలపై స్పష్టత రావడం వల్ల ఎవరి పనిలో వారు నిమగ్నమైపోతారని టీడీపీ పెద్దలు భావించారు. అయితే… పవన్ మాత్రం ఈ కార్యక్రమాన్ని నాంచుతున్నారు. దీనికి కారణం ఏమై ఉంటుందనే సందేహం టీడీపీ పెద్దల్లో కలుగుతుందని అంటున్నారు.
వాస్తవానికి ఈరోజు మంగళగిరిలో జనసేన విస్తృత స్ధాయి భేటీ జరగనుందని.. ఆ వెంటనే టీడీపీ, జనసేన యాక్షన్ కమిటీపై తుది నిర్ణయం తీసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ.. సడన్ గా పవన్ కళ్యాణ్ తన పర్యటనని వాయిదా వేసుకున్నారు. ఇటీవల కృష్ణా జిల్లాలో వారాహి యాత్రని ముగించుకున్న పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత సినిమా షూటింగ్స్‌లో బిజీ అయిపోయారు! అయితే ఊహించని విధంగా… పవన్ కూ వైరల్ ఫీవర్ సోకడంతో భేటీని వాయిదా వేసుకున్నట్లు జనసేన సమాచారం అందించింది.
దీంతో టీడీపీలో అసహనం పెరిగిపోతుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి మొదటినుంచీ టీడీపీకి తలనొప్పిగానే ఉందని గుర్తుచేసుకునే ప్రయత్నం చేస్తున్నారంట. ఉదాహరణకు… ఇటీవల పెడనలో జరిగిన వారాహి యాత్రలో టీడీపీ బలహీనంగా ఉంది కాబట్టే తాను పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు పవన్. ఇది అటు టీడీపీఇ కేడర్ కు, ఇటు జనసేన కేడర్ కు కూడా అసహనం కలిగించింది.
టీడీపీ బలహీనంగా ఉంటే.. బలపరిచేటంత బలవంతుడా పవన్ కల్యాణ్ అని టీడీపీ కార్యకర్తలు ఫైరయ్యారు! మరోపక్క… టీడీపీ బలహీనపడితే దాన్ని రాజకీయంగా క్యాష్ చేసుకుని బలపడటం మానేసి, వారికి బలం మందులా మారడానికి పార్టీ పెట్టింది అంటూ జనసైనికులు నిప్పులు చెరిగారు. దాంతో అధికార వైసీపీకి అస్త్రం దొరికినట్లయ్యింది. మరోపక్క తాజాగా జాయింట్ యాక్షన్ కమిటీ కార్యరూపం దాల్చనీయడం లేదు.
సరే వైరల్ ఫీవర్ దేముందిలే.. రెండు మూడు రోజుల్లో తగ్గిపోద్ది.. తగ్గిపోకపోతే వర్చువల్ మీటింగ్ పెట్టి అయినా ముందు ఉమ్మడి కార్యచరణ ఫిక్స్ చేసేద్దామని టీడీపీ పెద్దలు తొందరపడుతున్నారంట. అయితే ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేది కాదని అంటున్నారు పరిశీలకులు. వైరల్ ఫీవర్ కారణంగా ఒక వారం రోజులు ఈ ఉమ్మడి కార్యచరణ ప్రక్రియ పెండింగ్ పడిపోద్దని చెబుతున్నారు.
ఆ తర్వాత అంటే… ఈ నెల 17 నుంచి పవన్ దేశంలోనే ఉండరు. విదేశాలకు వెళ్లబోతున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహాన్ని ఇటలీలో మెగా ఫ్యామిలీ ప్లాన్ చేయగా.. పవన్ అక్కడికే వెళ్లబోతున్నారు. అక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన అనంతరం తిరిగి హైదరాబాద్ కి ఈ నెల 26న తిరిగొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యి.. పొత్తు, సీట్ల పంపకంపై క్లారిటీ తీసుకోవాలని టీడీపీ భావిస్తోంది.
అయితే… జైలులో అరగంట ములాకత్ అయితేనే పొత్తు ప్రకటించేసిన పవన్.. ఇప్పుడు ఉమ్మడి కార్యచరణ విషయంలో మాత్రం ఎందుకు ఇలా తాత్సారం చేస్తున్నారు అనే అనుమానాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే… దీనికి వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో… పవన్ కి వచ్చింది వైరల్ ఫీవర్ కాదా… “ఆరెంజ్” ఫీవరా అనే చర్చ మొదలైంది.
టీడీపీని అణగదొక్కి… జనసేనతో కలిసి ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలని భావిస్తుందని… అందులో భాగంగానే వ్యూహాత్మకంగా పవన్ అనే ఆయుదాన్ని టీడీపీపైకి ప్రయోగించి ఉండొచ్చని… అది గ్రహించలేకపోయిన చంద్రబాబు & కో ఇలా దొరికిపోయి ఉంటారని అంటున్నారు. మరి పెళ్లికోసం ఇటలీ వెళ్లేలోపు పవన్ ఉమ్మడి కార్యచరణ ఇవ్వకపోతే… ఆ అనుమానం బలపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లే!!