దాదాపు వంద కోట్ల రూపాయల విలువైన భూమి అది. తక్కువ ధరకే లభిస్తుందంటూ ఏకంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించాడో అక్రమార్కుడు. భూ యజమానితో వున్న కాస్త పరిచయాన్ని అడ్డం పెట్టుకుని నకీలీ పత్రాలు రూపొందించి, భూ యజమానికి తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేయించేశాడు. విషయం తెలిసి భూ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మొత్తం కథ వెలుగులోకి వచ్చింది. 100 కోట్ల విలువైన భూమి కావడం, భూ యజమాని అమెరికాలో స్థిరపడ్డ ధనవంతుడు కావడంతో.. ఈ కేసులో అతనికి న్యాయం జరిగింది. మరి, సామాన్యుడి పరిస్థితేంటి.? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవబోతున్న విశాఖ కేంద్రంగా ‘భూ కుంభకోణాల’ విషయమై గత కొంతకాలంగా తీవ్రమైన రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి.
వైఎస్ జగన్ ప్రభుత్వంలోని కొందరు ‘పెద్దలు’ గద్దల్లా మారిపోయి, విశాఖలోని భూముల్ని కొట్టేస్తున్నారన్నది విపక్షాల ఆరోపణ. మరోపక్క, చంద్రబాబు హయాంలోనే విశాఖ నగరం దోపిడీకి గురయ్యిందనీ, విశాఖలో చాలా భూములు టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్ళిపోయాయనీ వైసీపీ ఆరోపిస్తోంది. ఇరు పక్షాల ఆరోపణల్లో ఏది నిజం.? అన్న విషయం పక్కన పెడితే, విశాఖపై రాజకీయ గద్దలు వాలాయన్నది మాత్రం నిర్వివాదాంశం. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవ్వాల్సిన విశాఖలో ఈ ల్యాండ్ స్కాములేంటి.? వంద కోట్ల విలువైన భూమి, తక్కువ ధరకే వస్తోందంటే, వైసీపీ ఎమ్మెల్యే ఎలా నమ్మేశారు.? ఇవన్నీ కీలకమైన ప్రశ్నలు. వీటికి సమాధానాలు దొరకాల్సి వుంది. గడచిన రెండున్నరేళ్ళలో ఏం జరిగింది.? అంతకు ముందు ఏం జరిగింది.? విశాఖలో భూముల తాజా పరిస్థితి ఏంటి.? అన్న అంశాలపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించాల్సిన అవసరం వుంది. లేదంటే, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయి.. అంతకు మించి విశాఖ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది.