ఇంట్లో ఈ దిశలో దీపం వెలిగిస్తే చాలు.. దరిద్రం దూరం, లక్ష్మీ కటాక్షం దగ్గర..!

హిందూ సంప్రదాయంలో దీపారాధనకు విశేషమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. సాయంత్రం వేళ ఇంట్లో వెలిగే ఒక్క దీపం కుటుంబ జీవితాన్నే మార్చేస్తుందనే నమ్మకం తరతరాలుగా వస్తోంది. శాస్త్రాల ప్రకారం దీపం కేవలం వెలుగు మాత్రమే కాదు.. అది ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి, సానుకూలతను పెంచే శక్తివంతమైన సాధనం. అయితే దీపం వెలిగించే విధానంలో, ముఖ్యంగా దిశ విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే ఆశించిన ఫలితాలు దక్కకపోవచ్చు.

శాస్త్రోక్తంగా చూస్తే తూర్పు దిశ దీపారాధనకు అత్యంత శ్రేష్ఠమైనదిగా భావిస్తారు. ఈ దిశలో దీపం వెలిగిస్తే ఆయురారోగ్యాలు మెరుగుపడతాయని, గ్రహ దోషాలు క్రమంగా తొలగిపోతాయని పండితులు చెబుతారు. మానసిక ప్రశాంతత పెరిగి, కుటుంబంలో ఐక్యత, సంతోషం నెలకొంటాయి. ఇంట్లో ఉద్రిక్తతలు తగ్గి, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.

ఆర్థిక స్థితి బలపడాలని కోరుకునేవారికి ఉత్తర దిశ ఎంతో అనుకూలంగా పరిగణిస్తారు. కుబేరుడి దిశగా భావించే ఉత్తర దిశ వైపు దీపపు వత్తిని ఉంచి వెలిగిస్తే సంపద ఆకర్షితమవుతుందని విశ్వాసం. వ్యాపారాల్లో స్థిరత్వం, ఆదాయం వృద్ధి, అప్పుల నుంచి ఉపశమనం లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి కటాక్షం వల్ల ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గుతాయి.

పడమర దిశలో దీపం వెలిగించడం వల్ల శత్రు బాధలు తగ్గి, చేపట్టిన పనుల్లో విజయాలు లభిస్తాయని అంటారు. అయితే దక్షిణ దిశ విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలని ధర్మశాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. దక్షిణ దిశను యమదిశగా భావిస్తారు. ఆ దిశగా దీపపు వత్తి ఉంచి వెలిగించడం వల్ల ఆర్థిక నష్టాలు, అనవసర సమస్యలు తలెత్తే అవకాశముందని నమ్మకం.

ఇందులో మరో ముఖ్యమైన నియమం ఏమిటంటే.. ప్రతిరోజూ సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం. గుమ్మం వద్ద వెలిగే దీపం దుష్టశక్తులను అడ్డుకుని, శుభశక్తులను ఆహ్వానిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆవు నెయ్యితో వెలిగించే దీపం ఇంటిని దేవాలయంలా మారుస్తుందని విశ్వాసం. నువ్వుల నూనెతో దీపం వెలిగించడం కూడా శ్రేష్ఠమైనదిగా పరిగణిస్తారు. దీపపు వెలుగు ఉన్న చోట దరిద్రం నిలవదని, నిత్యం భక్తిశ్రద్ధలతో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లోనే స్థిరనివాసం ఏర్పరుచుకుంటుందని పండితులు సూచిస్తున్నారు.