AP: అందుకే చంద్రబాబు జైలుకు వెళ్లారా…. బాబు అరెస్టుపై టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు!

AP: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కూటమి పార్టీలలో అంతర్గత పోరు మొదలైందా అంటే అవుననే తెలుస్తుంది. ఇప్పటికే జనసేన తెలుగుదేశం రెండు పార్టీల మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయి ఇలాంటి తరుణంలోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తమ పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.కర్నూలు టీడీపీ అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలో కష్టపడుతున్న వారికి ఎలాంటి గౌరవం గుర్తింపు లభించడం లేదని తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీని అంటిపెట్టుకొని తెలుగుదేశం పార్టీ జెండాలను మోసి పార్టీ కోసం జైలుకు వెళ్లిన కార్యకర్తలను పార్టీ అధికారంలోకి రాగానే పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వారు ఇప్పటికీ రోడ్లపైనే ఉన్నారని ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు కూడా ఇప్పటికీ అలాగే ఉన్నారని తెలిపారు.

ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారికే పెద్ద పీట వేస్తున్నారని మండిపడ్డారు. దీని కోసమేనా లోకేశ్ పాదయాత్ర, చంద్రబాబు జైలుకు వెళ్లిందంటూ నిలదీశారు. పార్టీ కార్యకర్తల దగ్గరే టీడీపీ నాయకులు లంచాలు తీసుకుంటున్నారని ఆయన ఆవేదన చెందారు. కర్నూలు జిల్లాలో పార్టీ ఇంచార్జిలు నేతలు అని చెప్పుకుంటున్న వారు పార్టీ కష్ట సమయంలో ఉన్నప్పుడు ఓడిపోయినప్పుడు ఎక్కడికి వెళ్లారు అంటూ ప్రశ్నించారు.

ప్రస్తుతం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు నాయకుల అయిపోయారు. సొంత పార్టీ కార్యకర్తల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎవరు లంచం ఇస్తే వారి పనులే పూర్తి అవుతున్నాయని, లంచం ఇస్తేనే పదవులు కూడా వస్తున్నాయి అంటూ ఈ సందర్భంగా తిక్కారెడ్డి సొంత పార్టీ నేతల గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చలకు కారణం అవుతున్నాయి.