కమళ వికాసంపై కండువాలు కప్పేయండి

దుబ్బాకలో ఓటింగ్ ముగిసింది. ఇక ఫలితాలు రావాల్సి ఉంది. అయితే ఇక్కడ బీజేపీ ఓడినా గెల్చినట్లుగానే భావిస్తున్నారు గులాబీ పార్టీ పెద్దలు. ఎందుకంటే దుబ్బాకలో ఏమాత్రం కార్యకర్తల బలం లేకున్నా బీజేపీ గట్టి పోటీని ఇచ్చింది. దీంతో అలర్ట్ అయిన కేటీఆర్ రానున్న గ్రేటర్ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే వికసిస్తున్న కమళానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గ్రేటర్ ఎన్నికలతో చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇందుకోసం బీజేపీ నాయకలను పెద్ద సంఖ్యలో ఆకర్శించి ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో బీజేపీకి బలమైన నాయకులు దొరక్కుండా  చూడాలని తాజా స్కెచ్ వేశారని సమాచారం.

బిజేపిలో నేత శ్రీధర్ రెడ్డికి గులాబీ కండువా కప్పినట్లే… బీజేపీలో అసంతృప్తితో ఉన్న నేతలను గుర్తించి వారిని గులాబీ గూటికి చేర్చాలని గ్రేటర్ మంత్రులను కేటీఆర్ ఆదేశించారని సమాచారం. రాజా సింగ్‌ వంటి నేతలు కూడా రాష్ట్ర కమిటీ కూర్పుపై బండి సంజయ్‌ తీరును తప్పుపట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బండి సంజయ్, ధర్మపురి అరవింద్ బీజేపీలో చక్రం తిప్పుతున్న నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న వెలమ, రెడ్డి నాయకులను గుర్తించి వారిని ఆకర్శించాలని సూచించినట్లు సమాచారం.

తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటున్న బిజేపికి గ్రేటర్ ఎన్నికల్లోనే గట్టిగా బదులు చెప్పాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆడుతున్న ఈ మైండ్‌గేమ్‌తో కమలం పార్టీ శిబిరంలో కలవరం మొదలైంది. పార్టీ నేతలు చేజారిపోకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే దృష్టి సారించారు.