KTR Mark Satires : జీడీపీపై కేటీయార్ సెటైర్లు.! బీజేపీ కౌంటర్ ఎటాక్స్.!

KTR Mark Satires : తెలంగాణ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ సోషల్ మీడియా వేదికగా ‘జీడీపీ’పై సెటైర్లు వేశారు. జీడీపీ అంటే గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు.. అవి పెరుగుతున్నాయ్.. అన్నది కేటీయార్ ఉవాచ.

నిజమే, వంట గ్యాస్ మండిపోతోంది.. పెట్రోల్, డీజిల్ రేట్లు షాక్ కొడుతున్నాయ్. కానీ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతోనే ఈ దుస్థితి అన్నది బహిరంగ రహస్యం.

అదే సమయంలో, సామాన్యుడ్ని ప్రభుత్వాలు పీల్చి పిప్పి చేసెయ్యడం కోసం పన్నుల మోత మోగిస్తుండడం కూడా పెట్రో ధరలు పెరగడానికి కారణం. ఖజానా నింపు కోవడం కోసం కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్, డీజిల్, పెట్రో ధరల్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి.

కేంద్రాన్ని తెలంగాణ మంత్రి ప్రశ్నిస్తున్నారు సరే, తెలంగాణ రాష్ట్రం తనంతట తానుగా పన్నులు తగ్గించే అవకాశం వున్నా ఆ పని ఎందుకు చేయడంలేదు.? రాష్ట్రాలు పన్నులు తగ్గించుకుంటే, కేంద్రంపైన కూడా ఒత్తిడి పెరుగుతుంది.

దొందూ దొందే అన్నట్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ అవగాహనతో సామాన్యుడ్ని గుల్ల చేసేస్తున్నాయి. అదీ అసలు సంగతి.

ఈమాత్రందానికి మోడీ సర్కారు మీద కేటీయార్ సెటైర్లేయడమెందుకు.? కేటీయార్ సెటైర్ల మీద బీజేపీ కౌంటర్ ఎటాక్ వేయడమెందుకు.? అంటే, జనాన్ని వెర్రి వెంగళప్పల్ని చేసెయ్యాలి కదా మరి.. అందుకే ఈ నాటకం.

గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు మండుతోంటే, సామాన్యుడు విలవిల్లాడతాడన్న కనీస సోయలేని ప్రభుత్వాలు, సంక్షేమం మాటున ప్రజల్ని సర్వనాశనం చేస్తున్న ప్రభుత్వాలు.. ఈ పాలనలో ప్రజలు ఇలా కాకపోతే ఇంకెలా వుంటారు.?