రేవంత్ రెడ్డి నోటికి తాళం వేసిన కేటీయార్

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోటికి తాళమేశారు, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కూడా అయిన కల్వకుంట్ల తారకరామారావు అలియాస్ కేటీయార్. డ్రగ్స్ కేసులో కేటీయార్ మీద రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేనా, ‘వైట్ ఛాలెంజ్..’ అంటూ వైద్య పరీక్షలకు సిద్ధం కావాలని సవాల్ విసురుతున్నారు. దానికి కేటీయార్ నుంచి కూడా గట్టిగానే కౌంటర్ వచ్చింది. అయితే, రేవంత్ ఆరోపణలపై గుస్సా అయిన కేటీయార్, పరువు నష్టం దావా వేశారు న్యాయస్థానంలో. కేసు విచారణ జరిపిన న్యాయ స్థానం, రేవంత్ రెడ్డి ఇకపై డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించిన వ్యవహారాలపై కేటీయార్ గురించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయకూడదని ఆదేశించింది. కేటీయార్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది న్యాయస్థానం.

టీడీపీ నేతగా వున్నప్పటినుంచీ తెలంగాణ రాష్ట్ర సమితిపై రాజకీయ పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డి, ఈ మధ్య మరింతగా హద్దులు దాటేసి, కేసీయార్.. కేటీయార్‌లను నేరుగా.. చాలా గట్టిగా సవాల్ చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు ఇరు వైపులనుంచీ పుట్టుకొస్తున్నాయి. డ్రగ్స్ కేసు వ్యవహారానికి వస్తే పలువురు సినీ ప్రముఖుల్ని ఇప్పటికే ఈడీ విచారించింది. మరోపక్క, సినీ ప్రముఖుల్ని గతంలో ఎక్సయిజ్ సిట్ విచారించగా.. ఆ విచారణ సందర్భంగా ఎవరి మీదా బలమైన ఆధారాలు దొరకలేదని తేలడం గమనార్హం. అంతే కాదు, బయో శాంపిల్స్ పరీక్షలకు పంపగా, ఆ శాంపిల్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్, తరుణ్.. అసలు డ్రగ్స్ తీసుకోలేదని తేలింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎక్సయిజ్ సిట్ మీద చాలా చాలా అనుమానాలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాలకు మరింత మసాలా దట్టించి రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ఇకపై ఆ విమర్శలకు తాళం పడినట్లే కనిపిస్తోంది కోర్టు ఆదేశాలతో.