గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల జాతరకు తెరలేచింది. ఈ రోజు నుండి నామినేషన్ పక్రియ మొదలవుతుంది. డిసెంబర్ 1 న పోలింగ్, డిసెంబర్ 4 న ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయి. నిజానికి గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేదాకా దీనిపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో పరిస్థితులు తెరాసకు అనుకూలంగా లేవు, గత నెలలో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో నగరాన్ని వరద ముంచెత్తింది. ఇక లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరీ దారుణం. నగరంలో వరదలకు కొందరు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. రోజుల తరబడి వరద నీటిలో బిక్కుబిక్కుమని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకు జీవుడా అని గడిపారు.
ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు తమ వైపు కళ్లెత్తి చూడలేదని కొందరు ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరోపక్క దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాసకు ఊహించని షాక్ తలిగింది. లక్ష మెజారిటీ అనుకున్న చోట ఓటమిని మూటకట్టుకుంది. ఆ విజయం తెరాస మానసిక స్తైర్యాన్ని దెబ్బతీస్తే, బీజేపీ యొక్క ఆత్మస్తైర్యాన్ని రెట్టింపు చేసింది. దుబ్బాక ఇచ్చిన కిక్ తో గ్రేటర్ ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటాలని దూకుడుగా ముందుకు వెళ్తుంది.
అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా తెరాస పాలనపై చర్చలు మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రేటర్ ఎన్నికలకు వెళితే పార్టీకి ఇబ్బందులు తప్పవని కేసీఆర్ భావించి ఎన్నికలను ఒక రెండు నెలలు వాయిదా వేయాలని అనుకున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. గ్రేటర్ ఎన్నికల బాధ్యతను తీసుకున్న మంత్రి కేటీఆర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలను వాయిదా వేసేదే లేదని , దుబ్బాక లో ఎదురైనా ఓటమికి వెంటనే గుణపాఠం చెప్పి తీరాలని, అదే సమయంలో తెరాస పాలనా మీద వస్తున్నా విమర్శలకు సమాధానంగా గ్రేటర్ లో ఘన విజయం సాధించి చెక్ పెట్టాలని భావించిన కేటీఆర్ గ్రేటర్ ఎన్నికల విషయంలో కేసీఆర్ తో మాట్లాడి ఆయన్ని ఒప్పించి ఎన్నికలకు వెళ్ళటానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేలా చేశాడని తెలుస్తుంది.
అయితే ఈ గ్రేటర్ ఎన్నికలు కేటీఆర్ యొక్క సత్తాకు అసలైన పరీక్ష అనే చెప్పుకోవాలి. పరిస్థితులు అనుకూలంగా వున్నప్పుడు, గాలి మనవైపు ఉన్నప్పుడు గెలవటం గొప్ప విషయం కాదు. పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు, ఎదురుగాలి మనవైపు వీస్తున్నప్పుడు గెలిచి నిలబడటమే అసలైన విజయం. ఇప్పుడు కేటీఆర్ కూడా అలాంటి విజయం కోసమే గ్రేటర్ ఎన్నికలకు సిద్దమయ్యాడు. ఇందులో మాత్రం విజయం సాధిస్తే మాత్రం కేటీఆర్ సీఎం కుర్చీకి అడుగుదూరంలోనే ఉన్నట్లు అవుతుంది. ఈ ఎన్నికల్లో మాత్రం ఓటమి ఎదురైతే సీఎం కుర్చీకి పది అడుగులు దూరమైనట్లే లెక్క.