తెలంగాణ సీఎంగా మంత్రి కేటీఆర్ బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా పెద్ద చర్చే నడుస్తోంది. సొంతపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్ సీఎం కానున్నారని బహిరంగ వేదికలపైనే వ్యాఖ్యానిస్తున్నారు. కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి అని ఓ మంత్రి.. ఆయన సీఎం అయితే ఆయన వెంటే మేమంతా ఉంటామంటూ మరో మంత్రి సమర్థించారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఒకడుగు ముందుకు వేసి కాబోయే సీఎంకి అభినందనలు తెలిపాడు. ఇటీవల ఈ వ్యవహారం పార్టీ వర్గాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇక ఈ విషయం పై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ బాంబు పేల్చారు. టీఆర్ ఎస్ పార్టీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ని సీఎం చేస్తే జరిగే పరిణామాలివేనంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ ను సీఎంను చేసే ప్రయత్నాల్లో ఉన్న కేసీఆర్.. ఫామ్ హౌస్ లో దోష నివారణ పూజలు చేశారన్నారు. ఆ ద్రవ్యాలను త్రివేణి సంగమంలో కలపడం కోసమే కాళేశ్వరం వెళ్లారని చెప్పారు. కేసీఆర్ కాళేశ్వరం పర్యటన వెనుక అసలు రహస్యం శనిపూజ కోసమేనన్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను కాపాడుకోవడం కోసమే కేసీఆర్ పొత్తుల పేరుతో కొత్త డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.
కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసిన వెంటనే టీఆర్ ఎస్ పార్టీలో అణుబాంబు పేలుతుందంటూ షాకిచ్చారు. ఆయన సీఎం కావడం ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల్లో చాలా మందికి ఇష్టం లేదంటూ బాంబు పేల్చారు. మరోవైపు బీజేపీ, టీఆర్ ఎస్ ఒక్కటేనని కేసీఆర్ కావాలనే తన అనుకూలమైన వ్యక్తులతో చెప్పిస్తున్నారని సంజయ్ ఆరోపించారు. రక్తపు మడుగులో రాజ్యం ఏలుతున్న కేసీఆర్ తో బీజేపీ ఎలాంటి పరిస్థితుల్లోనూ పొత్తుపెట్టుకోదు అని అన్నారు. యాక్షన్ లో కెసిఆర్ ని మించిన నటుడు లేడని, సీఎం కేసీఆర్ ని పెట్టి సినిమా ఇస్తే 20 గంటల్లోనే పూర్తవుతుంది అంటూ విమర్శలు చేశారు.