ఏపీకి కృష్ణా బోర్డు షాక్

YS Jagan

శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కృష్ణానీటి త‌ర‌లింపుపై ఏపీ ప్ర‌భుత్వం జారీ చేసిన 203 జీవో పై తెలంగాణ ప్ర‌భుత్వం అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో…ఇరు రాష్ర్టాల మ‌ధ్య నీటి యుద్ధం మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చిన సంగ‌తి తెలిసిదే. త‌మ అనుమ‌తి, బోర్డు అనుమ‌తి లేకుండా నీటిని ఎలా త‌ర‌లిస్తారని తెలంగాణ అంటే..విభ‌జ‌న చ‌ట్టానికి లోబ‌డే పొతిరెడ్డి పాడు ప్రాజెక్ట్ కు త‌ర‌లిస్తున్నామ‌ని ఏపీ వాదిస్తోంది. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో కృష్ణా బోర్డు ఏపీకి లేఖ రూపంలో షాక్ ఇచ్చింది. ఏపీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన 203 జీవోపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. రాష్ర్ట పున‌ర్విభ‌జ‌న చ‌ట్టానికి జీవో విరుద్దంగా ఉంద‌ని లేఖ‌లో పేర్కొంది. 11వ షెడ్యూల్ ప్ర‌కారం గోదావ‌రి, కృష్ణాన‌ది ప‌రివాహ‌క ప్రాంతాల్లో అపెక్స్ క‌మిటీ అనుమ‌తి లేకుండా ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాలు ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ లు నిర్మించకూడ‌ద‌ని బోర్డు లేఖ‌లో స్ప‌ష్టం చేసింది. శ్రీశైలం రిజ‌ర్వాయ‌ర్ నుంచి అద‌నంగా మూడు టీఎంసీల నీటిని పంప్ చేసే కొత్త స్కీమ్ పై ఏపీ ప్ర‌భుత్వాన్ని బోర్డు వివ‌ర‌ణ కోరింది.

వెంట‌నే ప్ర‌భుత్వ ఉద్దేశాన్ని తెలియ‌జేయాల‌ని జల‌వ‌న‌రుల శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అదిత్యాన‌థ్ దాస్ ను బోర్డు ఆదేశించింది. దీంతో ఏపీ ప్ర‌భుత్వం కృష్ణా బోర్డుకు ఎలాంటి వివ‌ర‌ణ ఇస్తుంది అన్న దానిపై సందిగ్ధ‌త నెల‌కొంది. కృష్ణా బోర్డు అనుమ‌తుల‌కు లోబ‌డే త‌మ ప్ర‌భుత్వం నీటి త‌ర‌లింపుపై ముందుకు వెళ్తుంద‌ని…రూల్స్ ని ఎవ‌రు మీర‌లేద‌ని ఇప్ప‌టికే సీఎం జ‌గ‌న్ చెప్పిన సంగ‌తి తెలిసిందే.