బీజేపీలోకి ఎవరొచ్చినా హామీలుండవ్: ఈటెలకు షాకిచ్చిన బండి సంజయ్

BJP Mark Shock To Etela Rajender

BJP Mark Shock To Etela Rajender

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ విషయమై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వారం రోజుల్లో ఈటెల, బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించిన బండి సంజయ్, బేషరతుగానే ఈటెల రాజేందర్ బీజేపీలో చేరుతున్నారనీ, ఆయనకు బీజేపీ అధిష్టానం ఎలాంటి హామీలూ ఇవ్వలేదని స్పష్టం చేశారు.

సాధారణంగా ప్రముఖ నాయకులు పార్టీలు మారితే, తమ రాజకీయ భవిష్యత్తుపై భరోసా పొందుతారు.. కొన్ని హామీల్ని కూడా దక్కించుకుంటారు. బేషరతు హామీ.. అనేది రాజకీయాల్లో వుండదు.. పార్టీ మారడానికి సంబంధించి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కూడా ఖచ్చితంగా బీజేపీ నుంచి భరోసా, హామీ అందుకునే వుండాలి.

ఈటెల రాజేందర్ అనూహ్యంగా కేసీఆర్ మంత్రి వర్గం నుంచి తొలగింపబడిన విషయం విదితమే. గులాబీ పార్టీ ఎదుగుదలలో ఈటెల కీలకంగా వ్యవహరించారు దాదాపు దశాబ్దంన్నర పైగానే. అలాంటి ఈటెలను, పూచిక పుల్లలా తీసి పక్కన పడేసింది తెలంగాణ రాష్ట్ర సమితి. దాంతో, ఆయన పార్టీ మారక తప్పడంలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడితో ఈటెల ఇప్పటికే కీలక భేటీ నిర్వహించారు.

తన రాజకీయ భవిష్యత్తుకి సంబంధించి స్పష్టమైన హామీ పొందారు కూడా. అదేంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. బండి సంజయ్ మాత్రం, అలాంటి హామీలేవీ బీజేపీలో వుండవని అంటున్నారు. బండి సంజయ్ ఈ తరహా ‘తేలిక’ వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. మిత్రపక్షం జనసేన విషయంలో నోరుజారి, బీజేపీకి నష్టం కలిగించిన సందర్భాలున్నాయి. ఇంతకీ, బండి సంజయ్ వ్యాఖ్యలపై ఈటెల రాజేందర్ ఎలా స్పందిస్తారు.? వేచి చూడాల్సిందే.