కోనసీమలో అగ్గి రేపిన రాజకీయం.! నేరం ఎవరిది.?

Konaseema

Konaseema : కోనసీమ ప్రాంతం కొత్త జిల్లాగా ఏర్పాటయ్యింది. ఆ జిల్లా పేరు మార్చుతూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ పేరు మార్పుని వ్యతిరేకిస్తూ కొందరు గత కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఆ ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయా.? మంత్రి ఇల్లు, అధికార పార్టీ ఎమ్మెల్యే ఇల్లు తగలబడటానికి కారణమెవరు.? ఇప్పుడు తెలుగునాట హాట్ టాపిక్‌గా మారిన ప్రశ్నలివి.

ప్రభుత్వ నిర్ణయాలన్నీ ప్రజామోదం పొందుతాయని అనుకోలేం. చాలా నిర్ణయాలకు ప్రజా వ్యతిరేకత వుంటుంది. అలాగని, ప్రజలు ప్రభుత్వాలపై తిరగబడే పరిస్థితులు వుంటాయా.? వుంటే, గడచిన మూడేళ్ళలో చాలానే జరగాలి. కానీ, కేవలం కోనసీమ జిల్లా పేరు విషయమై మాత్రమే ఎందుకు ‘మంట’ రేగింది.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

అధికార పార్టీ నేతల తీరు చూస్తోంటే, ఓ సామాజిక వర్గాన్ని ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్లుగా వుంది. ఓ రాజకీయ పార్టీ పేరుని కూడా అధికార పార్టీ పరోక్షంగా ప్రస్తావిస్తోంది. ఇదెక్కడి తీరు.?

అధికార పార్టీ ఎమ్మెల్సీ, తన మాజీ కారు డ్రైవర్‌ని చంపేస్తే, ఆ ఘటనలో బాధి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళిన విపక్ష నేతల్ని పోలీసులు వ్యూహాత్మకంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలకు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

అలాంటిది, కోనసీమలో ఇంత పెద్ద ఘటన.. అందునా మంత్రి, ఎమ్మెల్యే ఇళ్ళను తగలబెట్టే పరిస్థితి వచ్చిందంటే, దీన్ని పోలీసు వైఫల్యమనాలా.? ఇంకేమన్నా అనాలా.? చాలా అనుమానాలున్నాయి ఈ ఘటనపై. ఇది ముమ్మాటికీ ప్రభుత్వానికి మచ్చతెచ్చే ఘటనే. విపక్షాల మీదనో, ఇంకెవరి మీదనో ఆరోపణలు చేసేసి అధికార పార్టీ చేతులు దులిపేసుకోవాలనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.