కోహ్లీకి అంద‌ని ద్రాక్ష‌గా ఐపీఎల్ ట్రోఫి.. కెప్టెన్ నుండి తొల‌గించాలంటూ డిమాండ్స్

ర‌న్ మెషిన్ విరాట్ కోహ్లీ ప‌ర్స‌న‌ల్ కెరీర్ గురించి మాట్లాడుకోవ‌ల‌సిన అవ‌స‌రమే లేదు. భార‌త క్రికెట్ జ‌ట్టు బాధ‌త్య‌ల‌ను మోస్తున్న విరాట్ త‌న కెరీర్‌లో చాలా ప‌రుగులు చేశాడు. రన్ మెషీన్‌లా ప్ర‌తి మ్యాచ్ లోను అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తూ భార‌త్‌కు ఎన్నో చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాలు అందించారు. భార‌త క్రికెట్ కెప్టెన్‌గా కూడా కోహ్లీకి మంచి రికార్డ్ ఉంది. అయితే ఐపీఎల్ విష‌యానికి వ‌స్తే ఇది కాస్త భిన్నంగా ఉంది. 13 సీజ‌న్స్‌లో ఎనిమిది సీజ‌న్స్‌లో రాయ‌ల్ ఛాలెంజ్ బెంగ‌ళూరు టీంకి ప్రాతినిథ్యం వ‌హిస్తూ వ‌స్తున్న కోహ్లీ ఒక్కటంటే ఒక్క‌సారి కూడా ఆ టీంకి ట్రోఫి అందించ‌లేక‌పోయాడు.

13 సీజన్లలో ఆరుసార్లు మాత్రమే ప్లేఆఫ్ చేరిన ఆర్సీబీ అందులో మూడుసార్లు ఫైనల్ చేరినా కప్ గెలవలేకపోయింది. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఈ సీజ‌న్‌లో ముక్కి మూలిగి ప్లేఆఫ్స్ కు చేరింది. ఈ సారైన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో విజ‌యం సాధించి ఫైన‌ల్‌కు వెళుతుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన‌ప్ప‌టికీ, వారికి నిరాశే మిగిలింది. ఈ సీజన్లో తొలి పది మ్యాచ్‌ల్లో ఏడింట్లో గెలిచిన బెంగళూరు.. కీలక దశలో చేతులెత్తేయ‌డం అభిమానుల‌కి ఏ మాత్రం మింగుడుప‌డ‌డం లేదు. కోహ్లి కెప్టెన్సీని వదులుకుంటే గాని ఆర్సీబీకి టైటిల్ ద‌క్క‌దని గంభీర్ లాంటి మాజీలు డిమాండ్ చేస్తున్నారు.

ఏ సీజ‌న్‌లో అయిన పేప‌ర్‌పై చూస్తే ఆర్సీబీ టీం చాలా స్ట్రాంగ్‌గా క‌నిపిస్తుంది. కాని గ్రౌండ్ లోకి దిగాక వీరి స‌త్తా ఏంటో తెలుస్తుంది. ముఖ్యంగా బ్యాటింగ్ వైఫ‌ల్యంతో ఈ టీం చాలా సార్లు ఓడింది. కోహ్లీ బాగానే రాణిస్తున్న‌ప్ప‌టికీ మిగ‌తా టీం స‌భ్యులు అత‌నికి స‌పోర్ట్ అందించ‌లేక‌పోవ‌డంతో భారీ స్కోర్స్ న‌మోదు చేయలేక‌పోతుంది. మ‌రో వైపు కోహ్లీ ప‌దేప‌దే తుది జ‌ట్టును మారుస్తుండ‌డం కూడా ఆర్సీబీ ఓట‌మి బాట ప‌ట్ట‌డానికి ప్ర‌ధాన కార‌ణం అని విశ్లేష‌కులు అంటున్నారు. టీమ్ సెలక్షన్ విషయంలో తెలివిగా వ్యవహరించడం, తుది జట్టును పదే పదే మార్చకుండా ఉంటే ఆర్సీబీకి ఐపీఎల్ ట్రోఫి ద‌క్క‌డం అంత క‌ష్ట‌మేమి కాదు అని మాజీలు అంటున్నారు. మ‌రి వ‌చ్చే ఏడాదైన ఆర్సీబీ టీం త‌మ త‌ప్పులు స‌రిదిద్దుకొని ట్రోఫీని ద‌క్కించుకుంటుందా లేదా అనేది చూడాలి.