కేసీఆర్‌కు షాకివ్వాలనుకుంటున్న ప్రొఫెసర్

Kodandaram to contest in MLC elections
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి పోరాడిన వ్యక్తుల్లో ప్రొఫెసర్ కోదండరాం కూడా ఒకరు.  పోరాటం అనంతరం రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్, కోదండరాం నడుమ సఖ్యత బెడిసింది.  అప్పటివరకు భుజం భుజం కలిపి తిరిగిన ఇద్దరూ ఎడమొహం పెడమొహం అయ్యారు.  గొప్పలు చెప్పుకున్న నోటితోనే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు.  చివరికి కోదండరాం టీజేఎస్ పేరిట పార్టీని పెట్టి గత ఎన్నికల్లో తెరాసకు వ్యతిరేకంగా పనిచేశారు.  కేసీఆర్ అయితే కోదండరాంను కనీసం వార్డు మెంబరుగా కూడా గెలవలేని కోదండరాం అంటూ మాట్లాడారు.  దీంతో కోదండరాంకు పంతం పెరిగింది.  
 
ఆ పంతమే ఆయను ఎమ్మెల్సీ పదవికి పోటీ పడేలా చేస్తోంది.  వచ్చే యేడాది ఫిబ్రవరికి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి.  వాటిలో ఒకటి వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం కాగా ఇంకొకటి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానం.  వీటిలో వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం నుండి పోటీలోకి దిగాలని కోదండరాం భావిస్తున్నారట.  ప్రస్తుతం ఈ స్థానం నుండి తెరాస రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పదవిలో ఉన్నారు.  వచ్చే దఫాలో కూడా ఆయనే పోటీలో ఉండొచ్చు.  ఆయన మీదే ప్రొఫెసర్ పోటీకి దిగాలని భావిస్తున్నారట. 
 
ఎందుకంటే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో కోదండరాంకు మంచి సంబంధాలున్నాయి.  మిగతా పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, కమ్యునిష్టు పార్టీలతో సఖ్యత కుదుర్చుకుని బరిలోకి దిగాలని కోదండరాం భావిస్తున్నారు.  పైగా ఇవి అసెంబ్లీ ఎన్నికల మాదిరి కాదు.  ఓటర్లు మొత్తం పట్టభద్రులే.  ప్రొఫెసర్ గా కొందండరాంకు విద్యావంతుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది.  ఈమధ్య ఆ వర్గంలో కేసీఆర్ పాలన మీద అసంతృప్తి కూడా పెరిగింది.  ఈ రెండు అంశాలు తనకు బాగా కలిసొస్తాయని కోదండరాం భావిస్తున్నారట.  ఇప్పటికే మద్దతు కోసం ఇతర పార్టీలతో మంతనాలు కూడా జరుపుతున్నారట.  మొత్తం మీద ప్రొఫెసర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి కేసీఆర్‌కు షాకివ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.