ఎవరు ఏమనుకున్నా ఏపీ రాజకీయాల్లో కుల సమీకరణాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయన్నది నిజం. ఇన్నేల్లు రాజకీయ పార్టీలన్నీ కుల పునాదుల మీదే నిలబడుతూ వచ్చాయి. ఆ కులాలను వాడుకునే పార్టీలు అధికారంలోకి వస్తే ముఖ్య నేతలు ముఖ్యమంత్రులయ్యారు. అలా కులాన్ని పుష్కలంగా వాడుకున్న నేతల్లో నారా చంద్రబాబు నాయుడు ఒకరు. ఈయనకు కమ్మ సామాజిక వర్గం ప్రధానం. అదే ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితానికి వెన్ను. ఆయన మూడు దఫాలు సీఎం అయ్యారంటే కమ్మ వర్గం వెనక ఉండబట్టే. ఇన్నేళ్ళు కమ్మ వర్గానికి తానొక్కడే పెద్ద దిక్కని చంద్రబాబు తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా బాబు తన వర్గంలో తన స్థాయిలోకి వేరొకరిని ఎదగనీయలేదని, తనొక్కడి ఆధిపత్యంలోనే మొత్తం సామాజిక వర్గం ఉండేలా చూసుకున్నారనే ఆరోపణలున్నాయి.
అసలు కమ్మ వర్గం మొహం చాటేస్తే చంద్రబాబు పొలిటికల్ చాప్టర్ క్లోజ్ అవుతుందని గత ఎన్నికలు నిరూపించాయి. కమ్మ ఓటర్లు కొద్ది శాతం వైసీపీ వైపు చూసేసరికి అధికారం పోయి 23 సీట్లకు పరిమితమైంది టీడీపీ. దీంతో చంద్రబాబు ఆయువుపట్టు కమ్మ వర్గంలోనే ఉందని అందరికీ సుస్పష్టమైంది. కమ్మ వర్గంలో చాలా మంది పారిశ్రామికవేత్తలు, పాపులర్ నాయకులు ఉన్నారు. వారే ఇన్నేళ్ళు చంద్రబాబు వెనుక ఉంటూ అన్ని విధాలా సహాకరిస్తూ వచ్చారు. అందుకే వారిని బాబుగారి క్యాంప్ నుండి బయటకు లాగితే బాబుగారికి కామాలు కాదు ఏకంగా ఫులుస్టాప్ పెట్టేయవచ్చని వైసీపీ భావిస్తోంది. అందుకే కమ్మ నేతలను రంగంలోకి దింపింది.
అలా దిగిన వాళ్లలో కొడాలి నాని ఒకరు. కమ్మ సామాజిక వర్గం నుండి వచ్చిన కొడాలి నాని అందరిలాగే మొదట బాబుగారి గూటిలోనే ఉన్నారు. కానీ చంద్రబాబు నైజం అర్థంచేసుకుని బయటకు వచ్చి వైసీపీలో చేరారు. జగన్ సైతం కమ్మ వర్గం మద్దతు కోసం నానికి మంత్రి పదవి ఇచ్చి బాబు మీదకే ప్రయోగించారు. నాని కూడ తన శక్తియుక్తులను కూడగట్టి మరొక కమ్మ నేత వల్లభనేని వంశీని టీడీపీ నుండి బయటకి రప్పించి తమలో కలుపుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ టీడీపీకి అండగా ఉన్న కమ్మ సామాజిక వర్గ ప్రముఖులను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారట. బాబును ఆర్థికంగా, రాజకీయంగా ఒంటరిని చేయాలనేదే వీరి వ్యూహంగా కనిపిస్తోంది. వారి వ్యూహాలే ఫలిస్తే చంద్రబాబు పాలిటిక్స్‌కి చరమగీతమే.