వైఎస్ జగన్ సీఎం అనునాటి నుండి తీరిక లేకుండా పనిచేస్తున్నారు . ఒకవైపు పాలనకే సమయం సరిపోకపోతుంటే మరోవైపు పార్టీని నడపడం. ఈ రెండు పనులతో జగన్ చాలా బిజీగా గడుపుతున్నారు. ప్రధానమైన విషయం రాష్ట్ర పాలన కాబట్టి ఆయన సమయంలో ఎక్కువ వాటా దానికే పోతుండగా పార్టీ మీద పెట్టాల్సినంత దృష్టి పెట్టలేకపోతున్నారు. ఇలాంటప్పుడే పార్టీలోని మిగతా నేతలు ఆయనకు చేదోడు వాదోడుగా ఉండాలి. పార్టీ గురించి భయపడకండి మేమున్నాం అనే భరోసా ఇవ్వగలగాలి. అప్పుడే ఆయన ప్రశాంతంగా పనిచేసుకోగలరు. కానీ వైసీపీ నేతలు కొందరు ఏం చేస్తున్నారయా అంటే ఆయనకు సహకరించడం అటుంచి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నారు.
పదవిలో ఉన్న ప్రజాప్రతినిధులు ఆచి తూచి మాట్లాడాలి. అందునా ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే మరింత జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా మాట్లాడాలి. సొంత అభిప్రాయాలను పక్కనపెట్టి ప్రజలు, సమాజం అనే కోణం నుండి సమస్యలను చూడాలి. కానీ వైసీపీ మంత్రి కొడాలి నాని మాత్రం కేవలం సొంత గొంతుకనే వినిపిస్తున్నారు తప్ప ప్రజల మనోభావాలను లెక్కలోకి తీసుకోవడంలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. నిన్న హిందూ దేవాలయాల మీద దాడులు, తిరుమల డిక్లరేషన్ వివాదాల మీద మాట్లాడిన మంత్రిగారు భక్తులకు ఆగ్రహం తెప్పించేలా మాట్లాడారు.
దేవతామూర్తుల విగ్రహల చేతులు, తలలు విరిగినా, రథం దగ్దమైనా, దుర్గ గుడిలో వెండి సింహాలు పోయినా వచ్చే నష్టం ఏమీలేదన్నట్టు మాట్లాడారు. ఇలా భక్తుల మనోభావాలను ఏమాత్రం గౌరవించకుండా మంత్రిగారు మాట్లాడటం సరికాదని సోషల్ మీడియాలో జనం విరుచుకుపడుతున్నారు. జగన్ ఈ వివాదంలో తన నిజాయితీని నిరూపించుకోవడానికి సీబీఐ విచారణకు ఆదేశించి మంచి స్టెప్ తీసుకున్నారని అనుకునేలోపు మంత్రిగారు నోటికి పని చెప్పి ఆ పేరును కాస్త మసకబరిచేశారని, అయినా జగన్ రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తుంటే మీరేమో ఇలా చెడ్డపేరు తీసుకొస్తారా అంటూ స్వయంగా పార్టీ కార్యకర్తలే అనుకుంటున్నారు.