Kodali Nani : చంద్రబాబుపై మళ్ళీ పేలిన కొడాలి బాంబు.!

Kodali Nani : ‘నన్ను రచ్చకీడ్చనంతవరకు చంద్రబాబు మీద నేను అభ్యంతకర వ్యాఖ్యలు చెయ్యను.. నన్నే కాదు, మా ముఖ్యమంత్రిని తూలనాడినాసరే, ఊరుకునే ప్రసక్తే లేదు. అప్పటివరకూ మాత్రం సంయమనం పాటిస్తాను..’ అంటూ మొన్నామధ్య గుడివాడ క్యాసినో వ్యవహారం తర్వాత కాస్త మెత్తబడిన మంత్రి కొడాలి నాని, మళ్ళీ ‘బాంబు’లా పేలారు.. అదీ చంద్రబాబు మీద.

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని దొంగల ముఠా నాయకుడిగా కొడాలి నాని అభివర్ణించారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు వ్యవహారంపైనా, సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాలపైనా చంద్రబాబు మీద దుమ్మెత్తిపోసేశారు కొడాలి నాని.

చిన్న సినిమాల్ని చంపేసింది చంద్రబాబేనన్నది కొడాలి నాని వాదన. ఒకటా.? రెండా.? కొడాలి నాని ఎడా పెడా చంద్రబాబు మీద విమర్శలు చేసేశారు, తిట్ల దండకం అందుకున్నారు. అయితే, గతంతో పోల్చితే, ఈసారి కాస్త తగ్గారు, బూతులు తిట్టడంలో. ఏమో, ఏ మంత్రం ఆయన మీద బలంగా పనిచేసిందో.!

కాపులు – కమ్మ సామాజిక వర్గానికి చెందినవారి మధ్య చిచ్చుపెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనీ కొడాలి నాని విమర్శించేశారు. ఫాఫం.. మళ్ళీ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి కంటి మీద కునుకు పట్టని పరిస్థితి వచ్చేసింది. అన్నట్టు, టీడీపీ నుంచి నాని మీద అంతే స్థాయిలో పలువురు నాయకులు విరుచుకుపడటం మొదలైపోయిందనుకోండి.. అది వేరే సంగతి.

ఇదిలా వుంటే, కొడాలి నాని కూడా గతంలో నిర్మాతగా పలు సినిమాలు రూపొందించారు. ఆయనకీ సినిమా పరిశ్రమకి సంబంధించిన సాధకబాధకాలు తెలుసు. ఆ అనుభవంతోనే, సినీ పరిశ్రమ వ్యవహారాలపై చంద్రబాబు మీద కొడాలి నాని విమర్శలు చేశారని అనుకోవచ్చేమో.