రోజుకి ఎంత నీరు తాగితే మూత్రపిండాలు సేఫ్.. ఇది నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం..!

మన శరీరంలోని ప్రతి అవయవం పనితీరుకు నీరు ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. నీరు మూత్రపిండాలకు నిజంగా ప్రాణాధారం అని వైద్యులు చెబుతున్నారు. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో, రక్తాన్ని శుభ్రపరచడంలో, ఖనిజాలు సమతుల్యం చేయడంలో మూత్రపిండాలు అద్భుతంగా పనిచేస్తాయి. అయితే ఇవి సరిగా పనిచేయాలంటే మనం తగినంత నీరు త్రాగడం తప్పనిసరి. లేకపోతే, క్రమంగా మూత్రపిండాల పనితీరు దెబ్బతిని, ప్రాణాంతక సమస్యలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా మనలో చాలామంది దాహం వేసినప్పుడే నీరు త్రాగుతారు. కానీ ఇది తప్పు అలవాటు అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మూత్రపిండాలు సక్రమంగా పనిచేయడానికి శరీరానికి నిరంతరంగా తగినంత ద్రవం అందాలి. రోజూ నీరు తగిన మోతాదులో తాగితే మూత్రం పలుచనగా ఉంటుంది, దానివల్ల మూత్రనాళ ఇన్ఫెక్షన్, మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రపిండాల వైఫల్యం వంటి సమస్యల అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి.

వైద్యులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి రోజుకి సగటున 3 నుండి 4 లీటర్ల వరకు నీరు త్రాగడం అవసరమని తెలిపారు. అయితే ఈ పరిమాణం వయసు, బరువు, వాతావరణం, రోజువారీ శారీరక శ్రమ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. వేసవిలో చెమట ఎక్కువయ్యే సమయంలో, కఠినమైన వ్యాయామం చేసినప్పుడు నీటి అవసరం ఇంకా పెరుగుతుందని సూచిస్తున్నారు.

నీటిని మించి ఇతర పానీయాలు తీసుకోవడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చక్కెర పానీయాలు, సోడా, కూల్ డ్రింక్స్ తాగడం కంటే సాధారణ నీరు తీసుకోవడమే శరీరానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా ఉదయం లేవగానే ఒక గ్లాసు నీరు త్రాగడం, వ్యాయామం చేసిన తర్వాత తప్పనిసరిగా నీరు తాగడం, బయట ఎండలో ఎక్కువసేపు గడిపిన తర్వాత నీరు పుష్కలంగా తీసుకోవడం మూత్రపిండాల రక్షణకు ఉత్తమ మార్గమని వారు సూచిస్తున్నారు.

అయితే నీరు కూడా పరిమితి మించి తాగకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధికంగా నీరు తాగడం వల్ల కూడా మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి పడుతుంది. కాబట్టి సమతుల్యతే ఆరోగ్యానికి మంత్రం. ఒక సులభమైన సూచన ఏమిటంటే.. మీ మూత్రం రంగును గమనించండి. అది లేత పసుపు లేదా స్పష్టంగా ఉంటే శరీరానికి నీరు సరిపడిందని అర్థం. కానీ ముదురు పసుపు రంగులో కనిపిస్తే.. నీటి మోతాదును పెంచుకోవాల్సిందే.

ముఖ్యంగా మూత్రపిండాల సమస్యలు, మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే వీరికి నీటి పరిమాణం సాధారణంగా వేరుగా ఉండొచ్చు. వైద్యులు చెబుతున్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మూత్రపిండాలు ఒకసారి దెబ్బతింటే తిరిగి పూర్తిగా కోలుకోవడం చాలా కష్టం. కాబట్టి ముందు జాగ్రత్తే శ్రేయస్కరం. రోజూ తగినంత నీరు త్రాగడం ద్వారా మాత్రమే మూత్రపిండాలను కాపాడుకోవచ్చని వారు పునరుద్ఘాటిస్తున్నారు.