జీహెచ్ ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. జీహెచ్ ఎంసీ ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఆధిక్యతను చాటుతూ వస్తుంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు తెలంగాణ భవన్ లో సంబరాలు చేసుకుంటున్నారు.
ఇకపోతే , గ్రేటర్ ఎన్నికల ఫలితాల సరళిపై సినీనటి, తమిళనాడు బీజేపీ నేత ఖుష్బూ స్పందించారు.
ఈ ఫలితాలు ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారో స్పష్టం చేస్తున్నాయని , తాము ఇంతకంటే ఏమీ చెప్పలేమని అన్నారు. బీజేపీపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని అన్నారు. తాము హైదరాబాద్ ప్రజల మనసు గెలుచుకున్నామని అన్నారు. హైదరాబాద్, హైదరాబాదీలకు థ్యాంక్స్ ఖుష్బూ థ్యాంక్స్ చెప్పారు. అయితే బీజేపీ విజయం సాధించకముందే ఖుష్బూ ఈ రకమైన ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓట్ల లెక్కింపు మొదలైన కొద్దిసేపటికే ఖుష్బూ ఈ రకమైన ట్వీట్ చేశారు. అయితే , ప్రస్తుత ట్రెండ్స్ ని బట్టి చూస్తే బీజేపీ కి మేయర్ పీఠం అందని ద్రాక్షగానే మిగలబోతుంది. అయితే, గతంతో పోలిస్తే ఆ పార్టీకి దక్కబోయే స్థానాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నా.. టీఆర్ఎస్‌ను జీహెచ్ఎంసీలో సవాల్ చేసే స్థాయిలో కమలం పార్టీ సీట్లు సాధిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక మధ్యాహ్నం 2 గంటల సమయానికి టీఆర్ఎస్ పార్టీ 40 చోట్ల ఆధిక్యం కనబర్చగా.. బీజేపీ 36 చోట్ల ముందంజలో ఉంది. ఎంఐఎం 13 స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఈ సమయానికి ఎంఐఎం 5 చోట్ల గెలవగా, టీఆర్ఎస్ 2 స్థానాల్లో గెలుపొందింది.