తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్ళారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుతో, ఆజాదీ కా అమృత మహోత్సవ్ వేడుకలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశంలో దేశంలోని పలువురు ప్రముఖులు పాల్గొననుండగా, ఈ కార్యక్రమంలో చంద్రబాబు కూడా పాల్గొననున్న సంగతి తెలిసిందే.
కాగా, ఢిల్లీకి వెళ్ళిన టీడీపీ అధినేత చంద్రబాబుకి, టీడీపీ ఎంపీ కేశినేని నాని ఝలక్ ఇచ్చారు. చంద్రబాబుకి స్వాగతం పలికిన ఎంపీలలో కేశినేని నాని కూడా వున్నారుగానీ, చంద్రబాబుతో అంటీ ముట్టనట్టు వ్యవహరించారు. చంద్రబాబుకి బొకే ఇచ్చేందుకు కేశినేని నానిని తోటి ఎంపీలు పిలవగా, నాని ఒకింత సీరియస్‌గానే ఆ విజ్ఞప్తిని తిరస్కరించారు.
ఇంతకీ, చంద్రబాబు విషయంలో అసంతృప్తి వున్నప్పుడు, ఆయనకు స్వాగతం పలికేందుకు, సన్మానించేందుకు కేశినేని నాని ఎందుకు వెళ్ళారబ్బా.? కేశినేని రాజకీయాలు ఇలాగే వుంటాయ్. పూర్తిగా తెగతెంపులు చేసుకోరు, అలాగని కలిసి వుండరు. కేశినేని నాని పొలిటికల్ డ్రామాలు చంద్రబాబుకీ తెలుసు.
నిజానికి, చంద్రబాబు – కేశినేని నాని మధ్య టామ్ అండ్ జెర్రీ ఫైట్ చాలాకాలంగా నడుస్తూనే వుంది. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం సహా అనేక కారణాలతో చంద్రబాబుని గిచ్చుతుంటారు.. చంద్రబాబుని మోస్తూనే వుంటారు కేశినేని నాని.
విజయవాడ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న కేశినేని నానిని ఎక్కడ లాక్ చేయాలో చంద్రబాబుకీ తెలుసు. కేశినేని నాని స్థానంలో ఆయన సోదరుడు కేశినేని చిన్నిని ప్రోత్సహిస్తున్నారు చంద్రబాబు. దాంతో, చంద్రబాబు మీద కేశినేని నాని ఒకింత అసహనంతో వున్నారు.
