తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఓ జిల్లాని దత్తత తీసుకుని, అభివృద్ధి చేస్తారట. ‘ఎందుకు అభివృద్ధి జరగదో నేనూ చూస్తాను..’ అంటూ గుస్సా అయ్యారు. అధికారుల్ని అప్రమత్తం చేశారు.. డెడ్ లైన్లు పెట్టేశారు.. ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారమవ్వాలనీ, తప్పులేమన్నా వుంటే పది రోజుల్లో సరిదిద్దుకోవాలనీ కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు అధికార యంత్రాంగానికీ, మంత్రులకీ ఇచ్చేశారు. ఆకస్మిక తనిఖీలూ నిర్వహిస్తారట.
పది రోజుల ముందే చెబుతారట.. ఆ తర్వాత ఆకస్మికంగా పర్యటిస్తారట.. ఇదీ కేసీఆర్ చెబుతున్నమాట. మంచిదే.. ముఖ్యమంత్రి ఇంత యాక్టివ్ అయితే.. అభివృద్ధి ఎందుకు జరగదు.? సమస్యలకు పరిష్కారమెందుకు దొరకదు.? కానీ, గడచిన ఏడేళ్ళలో ఎందుకు ఈ తరహా ప్రయత్నం కేసీఆర్ చెయ్యలేదు.? అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న.
ఈటెల రాజేందర్ రాజీనామాతో, తెలంగాణ రాష్ట్ర సమితి హంగా మొదలు పెట్టిందనడానికి కేసీఆర్ చేస్తున్న హడావిడే నిదర్శనమన్నది విపక్షాల వాదన. ఎన్నికలొస్తే తప్ప కేసీఆర్ అభివృద్ధి అనే మాట గురించి ఆలోచించరని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కొడంగల్ అభివృద్ధి ఏమయ్యింది.? నాగార్జునసాగర్ అభివృద్ధి మాటేమిటి.? ఇలాటి ప్రశ్నాస్త్రాలు కేసీఆర్ వైపు దూసుకెళ్ళడం సహజమే మరి.
గడచిన ఏడేళ్ళలో తెలంగాణ వ్యాప్తంగా ఆయా జిల్లాల్ని మంత్రులో, పార్టీ ముఖ్య నేతలో దత్తత తీసుకుని వుంటే, తెలంగాణ రాష్ట్రంలో పేదరికం అనే మాటకు తావుండేది కాదు.. సమస్యల లేమి.. అన్న చర్చే జరిగేది కాదు. సరే, ఇప్పటికైనా కేసీఆర్.. అభివృద్ధిలో ‘పరుగు’ అంటున్నారు. చూద్దాం.. అదెంత నిజమో.. అందులో ఎంత చిత్తశుద్ధి వుందో.