కేసీయార్ జాతీయ పార్టీ ప్రకటన హైద్రాబాద్‌లోనే.!

KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, త్వరలో జాతీయ పార్టీని ప్రకటించబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంతకీ, ఆ జాతీయ పార్టీ కథా, కమామిషు ఏంటి.? అంటే, అదైతే ప్రస్తుతానికి సస్పెన్సే. అయితే, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే, హైద్రాబాద్‌లోనే కేసీయార్, తన కొత్త జాతీయ పార్టీని ప్రకటిస్తారని తెలుస్తోంది.

మరి, తెలంగాణ రాష్ట్ర సమితిని ఏం చేస్తారు.? ఈ విషయమై స్పష్టత రావడంలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీనే భారత రాష్ట్ర సమితిగా మార్చుతారనే ప్రచారమైతే ఒకటి జరుగుతున్నా, అది సాధ్యం కాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే, కొత్త రాజకీయ పార్టీ ద్వారా దేశ రాజకీయాల్లో రాణించాలంటే అంత తేలిక కాదు. పైగా, తెలంగాణ సెంటిమెంట్ అటకెక్కి.. తెలంగాణలోనూ గులాబీ పార్టీ ప్రాభవం కోల్పోవాల్సి వస్తుంది. అందుకే, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అలాగే వుంటుందనీ, కొత్త జాతీయ పార్టీని ఆయన ఇంకాస్త కొత్తగా ప్రకటిస్తారనీ అంటున్నారు. అదెలా సాధ్యం.? అన్నదానిపైనా భిన్నవాదనలున్నాయి.

వాస్తవానికి దేశ రాజధాని ఢిల్లీలో తొలుత జాతీయ పార్టీ విషయమై ప్రకటన చేయాలనుకున్నారట కేసీయార్. కానీ, అందుకు పరిస్థితిులు అనుకూలంగా లేవనే భావనకు కేసీయార్ వచ్చారట. కలిసొచ్చే రాజకీయ పార్టీలతో కలిసి కూటమి కట్టడం కంటే, అందులో తెలంగాణ రాష్ట్ర సమితిని భాగం చేసే కంటే.. జాతీయ స్థాయి రాజకీయ పార్టీని స్థాపించి, దానికి ఇతర పార్టీల మద్దతుని కూడగట్టడం తేలికని కేసీయార్ భావిస్తున్నారు.

అన్నీ అనుకున్నట్లు జరిగితే విజయదశమి తర్వాత ఏ క్షణంలో అయినా కొత్త రాజకీయ పార్టీని కేసీయార్ ప్రకటించవచ్చునట.