తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కొత్త జాతీయ పార్టీ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ‘భారత రాష్ట్ర సమితి..’ అనే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ, జాతీయ పార్టీకి ‘రాష్ట్ర’ అని ఎలా పెడతారు.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది. ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్..’ అంటే, రాష్ట్రానికి పరితమైంది కాదు. ‘భారత్ రాష్ట్ర్..’ అంటుంటారు భారతదేశం గురించి.
సరే, ఆ సంగతి పక్కన పెడితే, భారత రాష్ట్ర సమితి పేరుని కేసీయార్ ఖరారు చేశారనుకుందాం. మరి, తెలంగాణ రాష్ట్ర సమితి ఏమవుతుంది.? ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర సమితి కీలక నేతల దగ్గరే ఖచ్చితమైన సమాధానం దొరకని పరిస్థితి.
జాతీయ రాజకీయాల్లో అవసరమైన మేర ‘పొలిటికల్ వాక్యూమ్ వుందా.?’ అన్నదానిపై మళ్ళీ భిన్న వాదనలున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ‘నేనే ప్రధాని అభ్యర్థిని..’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆయనో కొత్త కుంపటిని షురూ చేయబోతున్నారు. మమతా బెనర్జీ సంగతి సరే సరి. అరవింద్ కేజ్రీవాల్ కూడా తానేం తక్కువ కాదంటున్నారు.
ఈ పరిస్థితుల్లో కేసీయార్ జాతీయ పార్టీ పెడితే, ఎవర్ని కలుపుకుపోతారు, ఎవరితో రాజకీయ వైరం కొనితెచ్చుకుంటారు.? ఏమోగానీ, జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలన్న ఆసక్తి అయితే చాలా ఎక్కువగానే వుంది తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి.
నిజానికి, జాతీయ రాజకీయాల్లోకి వెళితే ఏమవుతుందో కేసీయార్‌కి బాగా తెలుసు. అయితే, తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త వేవ్ సృష్టించడం కోసం కేసీయార్ జాతీయ పార్టీ జపం చేస్తున్నారన్నది నిర్వివాదాంశం. జాతీయ పార్టీని దసరా సందర్భంగా ప్రకటించినా, అది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే యాక్టివ్ అవబోతోందిట. సో, వ్యూహం అర్థమయిపోయింది కదా.!