కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి కృషి సంచాయీ యోజన కింద నిధులు కేటాయించే అంశానికి సంబంధించి కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. కేంద్ర జల శక్తి శాఖకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ ఈ మేరకు లేఖ రాయడం గమనార్హం. వెలిగొండ ప్రాజెక్టుకి కృష్ణా ట్రైబ్యునల్‌లో కేటాయింపులు లేవన్నది తెలంగాన వాదన. కేవలం వరద జలాల ఆధారంగా ఈ ప్రాజెక్టుని ఏపీ చేపట్టిందని తెలంగాణ ఆరోపిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా బేసిన్ వెలుపలకు నీళ్ళను ఏపీ ప్రభుత్వం తరలిస్తోందని తెలంగాణ ఆరోపిస్తుండడం గమనార్హం. అనుమతి లేని ప్రాజెక్టుకి ఏఐబీపీ కింద నిధులు ఇవ్వడమేంటి.? అని తెలంగాణ ప్రశ్నిస్తోంది. నిజానికి, వెలిగొండ ప్రాజెక్టు ఎన్నో ఏళ్ళుగా బాలారిష్టాల్ని ఎదుర్కొంటోంది. అధికారంలో ఎవరున్నాసరే, ఈ ప్రాజెక్టు మీద పూర్తిస్థాయి నిర్లక్ష్యమే ప్రదర్శిస్తూ వచ్చారు. ఎప్పుడో పూర్తవ్వాల్సిన ఈ ప్రాజెక్టుని బాలారిష్టాలు మాత్రం వీడటంలేదు. ఇప్ప
డిలా తెలంగాణ నుంచి ఈ ప్రాజెక్టు మీద మరో పిడుగు పడింది. ఏబీఐపీ కింద నిధులు కేటాయించడమంటే, ప్రాజెక్టు విషయంలో అన్ని అనుమతులూ వున్నట్లే కదా లెక్క.? మరి, తెలంగాణ ఈ విషయంలో ఎందుకు అభ్యంతరాలు లేవనెత్తుతోందట.? రెండు తెలుగు రాష్ట్రాల మధ్యా నీటి ప్రాజెక్టుల విషయమై పరస్పర సహకారం వుండి తీరాల్సిందే. కానీ, దురదృష్టవశాత్తూ ఆ స్నేహ సంబంధాలు కనిపించడంలేదు. కారణం ఏదైతేనేం, తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ కారణంగా చాలా ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యేలా వుంది. మనమంతా తెలుగువారం, మనమంతా భారతీయులం.. అన్న భావన లేకుండా, ఆయా ప్రాజెక్టుల వల్ల లాభపడే ప్రజల పట్ల కనీస బాధ్యత లేకుండా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు వ్యవహరిస్తుండడం శోచనీయం.