కేసీయార్ లెక్క 50, వైఎస్ జగన్ లెక్క 80

కృష్ణా జలాల్లో నీటి వాటా విషయమై తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయితీ నడుస్తున్న విషయం విదితమే. ఉమ్మడి తెలుగు రాష్ట్ర విభజన సమయంలోనే, ఈ లెక్కలు పక్కాగా రాసేసి వుండాలి. కానీ, అలా జరగకపోవడం వల్ల ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం ముదిరి పాకాన పడింది. చెరిసగం వాటా కోరుతోంది తెలంగాణ. ససేమిరా అంటోంది ఆంధ్రప్రదేశ్. నిజానికి, చెరిసగం వాటా తెలంగాణ కోరడం అస్సలేమాత్రం సబబు కాదు. ఎందుకంటే, వరద పీడిత ప్రాంతం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఎగువన వుంది తెలంగాణ. మొన్నటికి మొన్న తెలంగాణ ప్రభుత్వం విచ్చలవిడిగా విద్యుదుత్పత్తి చేసేసి, నీళ్ళకు కిందికి వదిలేస్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్క నీరు కూడా ఉపయోగపడలేదు.. అదంతా సముద్రంలో కలిసిపోయింది. మరి, ఆ లెక్కల మాటేమిటి.. అందుకే, లెక్కలు పక్కగా వుండాలి.

కేసీయార్ 50 శాతం కోరుతున్న దరిమిలా, దాన్ని ఖండిస్తూ, వైఎస్ జగన్ 80 శాతం కావాలంటున్నారు. ఈ లెక్క ఎక్కడ తెగుతుంది.? అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి వుంది. నీటి కేటాయింపులకు సంబంధించి రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ఏర్పడ్డాయి.. వాటికే సర్వాధికారాలు.. అంటోంది కేంద్రం. ఏడేళ్ళుగా ఎందుకు నీటి కేటాయింపులపై స్పష్టత రాలేదు.? అన్న ప్రశ్నకు నరేంద్ర మోడీ ప్రభుత్వం నుంచి సమాధానం దొరకదుగాక దొరకదు. ఎందుకంటే, తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీని కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ఎంజాయ్ చేస్తోంది. ఇదొక రాజకీయ పరమైన అంశమైంది తప్ప, తెలుగు ప్రజల జీవన్మరణ సమస్యగా మాత్రం రాజకీయ పార్టీలు చూడలేకపోతున్నాయి. ఏమో, ఈ లెక్కలు ఎప్పుడు తేలతాయో, ఎలా తేలతాయోగానీ.. ముందు ముందు మాత్రం నీటి పంపకాల వివాదాలు ముదిరి పాకాన పడనున్నాయన్నది నిర్వివాదాంశం. అది రెండు తెలుగు రాష్ట్రాలకూ మంచిది కాదు.