కేసీఆర్ ముందున్న ఆప్షన్ ‘సెంటిమెంట్’ మాత్రమేనా.?

KCR To Play Sentiment Card Again

KCR To Play Sentiment Card Again

తెలంగాణలో మళ్ళీ సెంటిమెంట్ రగల్చాల్సిన ఆవశ్యకతను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గుర్తించారా.? మరోమారు సెంటిమెంట్ రగిల్చితే తప్ప, మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే ఖచ్చితమైన సమాచారం కేసీఆర్ తెలుసుకున్నారా.? అంటే, ఔననే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

నిజానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ‘సెంటిమెంట్’ అస్త్రాన్ని కేసీఆర్ బీభత్సమైన స్థాయిలో ఉపయోగించింది లేదు. అడపా దడపా ‘మమ’ అనిపిస్తున్నారంతే. అయితే, రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. కాంగ్రెస్ పార్టీని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఏడేళ్ళ పాలన తర్వాత తెలంగాణలో ఏం అభివృద్ధి జరిగింది.? అన్నదానిపై చర్చ మొదలైంది. ఈ చర్చ సహజంగానే అధికార పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

టీఆర్ఎస్ చెప్పుకుంటున్నట్టు ఎంత అభివృద్ధి జరిగినా, ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది వుంటుంది. వరుసగా రెండు పర్యాయాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు గనుక, ప్రభుత్వ వ్యతిరేకత ఎలా వుంటుందో ఆయనకీ తెలుసు. అందుకే, సెంటిమెంట్ అస్త్రాన్ని అతి త్వరలో కేసీఆర్ తెరపైకి తీసుకురాబోతున్నారట.

గులాబీ నేతలు, పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా వుండడంతో ఈ అస్త్రం గులాబీ పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని గులాబీ బాస్ ఆలోచన చేస్తున్నారని సమాచారం. సెంటిమెంట్ అస్త్రం కేసీఆర్ తీస్తే, చాలా అంశాలు చర్చకు వస్తాయి. ప్రతి అంశమూ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి రాజకీయంగా కలిసొచ్చేదే అవుతుంది.