ఏపీలో కేసీయార్ ప్లాన్-బి అమలు చేయనున్నారా.?

జాతీయ రాజకీయాల్లో కొత్త శక్తిగా అవతరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీయార్ వ్యూహ రచన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంట గెలిచి రచ్చ గెలవాలని పెద్దలు చెబుతుంటారు. తెలంగాణలో కేసీయార్ గెలుపు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, ఇక్కడ ‘ఇంట’ అంటే, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా వుంటుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ఆయన మంత్రిగా గతంలో పని చేసిన దరిమిలా, అసలు కేసీయార్.. తాను జాతీయ నాయకుడినేనని ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ నిరూపించుకోవాల్సి వుంటుంది.

కొన్నాళ్ళ క్రితం, ‘ఏపీలోనూ తెలంగాణ రాష్ట్ర సమితి గురించి మాట్లాడుకుంటున్నారు.. కేసీయార్ నాయకత్వం కోరుకుంటున్నారు..’ అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ వ్యాఖ్యానించడం అప్పట్లో పెను సంచలనంగా మారింది. అయితే, ఏపీలో అధికార వైసీపీకి, తెలంగాణ రాష్ట్ర సమితి బయట నుంచి మద్దతిస్తున్న మిత్రపక్షంగా వుంది.

కానీ, తెలంగాణ రాష్ట్ర సమితిని కేవలం టీడీపీ వ్యతిరేక పార్టీగా మాత్రమే చూస్తూ, ఆ కోణంలోనే ఆ పార్టీతో తమకు సఖ్యత వుంది తప్ప, తెలంగాణ రాష్ట్ర సమితి మీదగానీ కేసీయార్ మీదగానీ తమకు ప్రత్యేకమైన అభిమానమేమీ లేదని వైసీపీ చెబుతోంది. పైగా, తెరవెనుకాల బీజేపీ అధిష్టానంతో వైసీపీకి సత్సంబంధాలున్నాయి. ఆ బీజేపీకి వ్యతిరేకంగా పెట్టబోయే కేసీయార్ పార్టీ వైపు వైసీపీ వెళ్ళడం దాదాపు అసాధ్యం.

ఈ నేపథ్యంలో కేసీయార్ దగ్గర ప్లాన్-బి వుందనీ, దాన్ని అమలు చేస్తారనీ గులాబీ శ్రేణులు ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యానిస్తున్నాయి. ఆ ప్లాన్-బి ఏంటి.? అంటే, తెలుగుదేశం పార్టీతో జత కట్టడమేనట. అయితే, నిండా మునిగిపోయిన టీడీపీతో జతకట్టి టీఆర్ఎస్ సాధించేదేముంటుంది.? పైగా, టీడీపీ కూడా తెరవెనుకాల బీజేపీతో స్నేహం చేస్తోంది.

ఎలా చూసినా, కేసీయార్ రాజకీయం.. ఆంధ్రప్రదేశ్లో సత్ఫలితాలనిచ్చేలా లేదు.t