హస్తినకు పోవలెనంటే, కారు కాదు.. విమానం కావాలె.!

అద్దెకు ప్రత్యేక విమానాలు దొరకవా.? ఎందుకు దొరకవ్.? చాలా రాజకీయ పార్టీలు ప్రత్యేక విమానాల్ని ఉపయోగిస్తున్నాయ్ కదా.? సినిమా ఫంక్షన్లకు, ఇతర అవసరాలకు సైతం ప్రత్యేక విమానాల్ని వినియోగిస్తున్న రోజులివి. దేశంలో పౌర విమానయాన శాఖలో వచ్చిన పెను మార్పుల్లో ఈ చార్టర్ విమాన సేవలు అతి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు.

కార్పొరేట్ రంగంలో దిగ్గజాలైనవారు ఎడా పెడా ఈ ప్రత్యేక విమానాల్ని వినియోగిస్తుంటారన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి, ఓ రాజకీయ పార్టీ ప్రత్యేకంగా చార్టర్ విమానాన్ని ఎందుకు కొనుగోలు చేయాలనుకుంటున్నట్టు.? నిజానికి, ఇందులో తప్పు పట్టాల్సిన విషయమేమీ లేదు. ఎందుకంటే, అది పార్టీ పరంగా చేసే కొనుగోలు గనుక.

ప్రభుత్వాలే ప్రత్యేక విమానాలు కావాలనుకుంటున్న రోజులివి.

ఇంతకీ, తెలంగాణ రాష్ట్ర సమితి ఎందుకు ప్రత్యేక విమానం కొనుగోలు చేయాలనుకుంటున్నట్టు.? ఇంకెందుకు, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలి గనుక, దేశవ్యాప్తంగా పర్యటనలు చేయాలి గనుక.! అప్పటికప్పుడు ప్రైవేటు చార్టర్ విమానాన్ని అద్దెకు తీసుకోవాలంటే ఒక్కోసారి కొంచెం ఇబ్బంది కలుగుతుంటుంది. అందుకే, సొంతంగా ప్రైవేట్ జెట్ కొనెయ్యాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఓ నిర్ణయానికి వచ్చేసింది.

80 కోట్లు వెచ్చించి ప్రత్యేక విమానాన్ని కొనుగోలు చేస్తుందట టీఆర్ఎస్. విజయదశమి తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితికి ఈ విమానం సొంతమవనుందనే ప్రచారం జరుగుతోంది. నిధుల సమీకరణ ఆల్రెడీ షురూ అయ్యిందని అంటున్నారు. కేసీయార్ తలచుకుంటే, ప్రత్యేక విమానానికి నిధులు దొరకవా.? జస్ట్ ఒకే ఒక్క రోజులో సమకూరతాయ్ 8 కోట్లు. అంతమంది ‘అభిమానులు’ వున్నారు తెలంగాణ రాష్ట్ర సమితికి.

అంతా బాగానే వుందిగానీ, కేసీయార్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పగలరా.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్. ముందుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకోసారి అధికారం దక్కించుకోవాలి. అదే, కేసీయార్ ముందున్న తక్షణ కర్తవ్యం. దానికోసమే కదా, ఈ ప్రత్యేక విమానం పేరుతో హైడ్రామా.! నిత్యం వార్తల్లో వుండేందుకే ఏదో ఒక హంగామా అన్నమాట.