మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహరావు పట్ల అధికార టిఆర్ఎస్ పార్టీ ఎక్కడ లేని మక్కువ చూపిస్తోంది. పీవీ మన ఠీవి అంటూ పీవీ శత జయంతి ఉత్సవాలను నిర్వహించడానికి పూనుకుంది. ఇన్నాళ్ళు గుర్తురాని పీవీ తెరాసకు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారు అంటే కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టడానికే. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల్లో పీవీని విస్మరించడం, ఆయన్ను సరిగ్గా గౌరవించకపోవడం కూడా ఉన్నాయి. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా పీవీకి దేశ వ్యాప్తంగా గొప్ప పేరుంది. కానీ కొన్ని కారణాల వలన ఆయనంటే కాంగ్రెస్ అధిష్టానానికి అంతగా పడేది కాదు. అయినా పీవీ తగ్గేవారు కాదు. చేయాల్సినవి చేసేవారు. చివరికి మరణించిన తర్వాత ఆయన భౌతిక కాయాన్ని కూడా ఏఐసీసీ కార్యాలయం లోపలికి కూడా తీసుకెళ్ళలేదు.
అది పీవీ కుటుంబ సభ్యులను తీవ్రంగా బాధించింది. అదే పీవీ మరణం తర్వాత ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి దగ్గర కాకుండా ఆపింది. దీన్నే కేసీఆర్ క్యాష్ చేసుకుంటున్నారు. పీవీ తెలంగాణ బిడ్డ కాబట్టి ప్రాంతీయాభిమానం పేరుతో ఆయన్ను ఓన్ చేసుకున్నారు. ఇక తాజాగా ఆయన కుమార్తె సురభి వాణిదేవికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉండగా ఆగష్టులో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పదవీ కాలమూ పూర్తవుతోంది. ఈ మూడు స్థానాలూ గవర్నర్ కోటా కిందికే వస్తాయి. వాటిలో రెండు మళ్లీ నాయిని, కర్నె ప్రభాకర్‌లకేనట. ఇక మూడవ స్థానంలో పీవీ కుమార్తెను కూర్చోబెట్టాలని చూస్తున్నారు.
పీవీ కుమార్తెకు రాజకీయ అనుభవం అస్సలు లేదు. ఆ ఆసక్తి కూడా లేదు. అలాంటి ఆమెను ఇప్పుడు ఎమ్మెల్సీని చేయాలనుకోవదం వెనుక కేసీఆర్ పెద్ద స్కెచ్ ఉంది. అందులో మొదటిది పీవీ చరీష్మాను కాంగ్రెస్ నుండి పూర్తిగా లాగేసుకోవడం. పీవీ శత జయంతి ఉత్సవాలతో రాష్ట్రంలో ఆ పని చేసిన కేసీఆర్ ఇప్పుడు ఆయన కుమార్తెకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి దాన్ని జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేసుకోవాలని అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే కేంద్ర స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ కాకుండా మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలనేది కేసీఆర్ ఆలోచన. ఆ ఆలోచనకు పీవీ చరీష్మా కొంత ఉపకరించే ఆస్కారం ఉంది. అందుకే కేసీఆర్ పీవీ కుటుంబాన్ని దగ్గర చేసుకుంటున్నారనేది కొందరి వాదన.