కేసీయార్ జాతీయ పార్టీ పెట్టబోతున్నారట.. అన్న ప్రచారం ఇప్పటిది కాదు. వినీ వినీ జనానికీ బోర్ కొట్టేసింది ఈ గాసిప్. కానీ, చిత్రంగా ఎప్పటికప్పుడు పాత విషయాన్నే కొత్తగా ప్రచారంలోకి తెస్తుంటాయ్ గులాబీ శ్రేణులు. గులాబీ బాస్‌కి బీభత్సమైన ఎలివేషన్లు ఇచ్చేందుకు ఆ మాత్రం తంటాలు పడాలి మరి. తెలంగాణలోనే టీఆర్ఎస్ పరిస్థితి దయనీయంగా మారిందాయె. అలాంటప్పుడు, కేసీయార్.. సొంత రాష్ట్రంలో చక్కబెట్టుకోవాల్సిన వ్యవహారాల్ని వదిలేసి, జాతీయ స్థాయిలో ఉద్ధరించేస్తానంటే ఎలా.?
పొరుగున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో విభజన సమస్యల విషయమై పరిష్కార మార్గాలు వెతకలేకపోయారు. నీటి పంపకాల విషయమై సోదర రాష్ట్రం పట్ల ఒకింత సోదరభావం చూపలేకపోతున్నారు. అలాంటి కేసీయార్, జాతీయ స్థాయి నేతగా మారితే పరిస్థితి ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తెలంగాణలో దుకాణం బంద్ అవబోతోంది కాబట్టి, జాతీయ పార్టీ.. అంటూ కేసీయార్ హడావిడి చేస్తున్నారన్నది గులాబీ బాస్ మీద ప్రత్యర్థి పార్టీల నుంచి దూసుకొస్తున్న విమర్శల సారాంశం. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలు, హుజూరాబాద్.. ఈ మూడింటినీ విశ్లేషిస్తే, తెలంగాణలో టీఆర్ఎస్ ఖేల్ ఖతం అయినట్లేనన్నది బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న వాదన.
పోనీ, జాతీయ రాజకీయాల్లో ఏమైనా కేసీయార్‌కి అనుకూలంగా పరిస్థితులు వున్నాయా.? అంటే, అక్కడ మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లాంటివారి హవా కొనసాగుతోంది. వాళ్ళను కాదని, కేసీయార్ ఎలా ముందడుగు వేయగలుగుతారు.? ఎలా చూసుకున్నా, కేసీయార్ ఢిల్లీ పంచాయితీ తెగేది కాదు. వృధా ప్రయాస మానుకుని, తెలంగాణ రాజకీయాల్ని కేసీయార్ చూసుకుంటే మంచిదేమో.!