కేంద్రంపై కేసీయార్ ఫైర్: నీతి అయోగ్ సమావేశాల్ని బహిష్కరించిన తెలంగాణ సీఎం.!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేశారు. 5జి స్పెక్ట్రమ్ వేలంలో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని కేసీయార్ ఆరోపించారు. మోడీ సర్కారు తమకు అత్యంత సన్నిహితులైనవారికి దోచిపెట్టిందని ఆరోపించారు.

నీతి అయోగ్‌ని పనికిరాని వ్యవహారంగా పేర్కొన్న కేసీయార్, నీతి అయోగ్‌ని అలా నీరుగార్చింది కూడా ప్రధాని నరేంద్ర మోడీయేననీ, అక్కడ భజనకు తప్ప, సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం వుండదని అన్నారు కేసీయార్.

రేపు ఢిల్లీలో నీతి అయోగ్ సమావేశం జరగనుండా ఆ సమావేశాన్ని బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించిన కేసీయార్, ‘అక్కడికి వెళ్ళఇ ఏం ప్రయోజనముండదు.. పల్లీలు తిని రావడమే.. నాలుగు నిమిషాలు మాత్రమే అక్కడ మాట్లాడేందుకు ముఖ్యమంత్రులకు అవకాశం వుంటుంది. అక్కడ మనం చెప్పేదానికి విలువ వుండదు.. అక్కడికి వెళ్ళి రావడమంటే ఖర్చు దండగ వ్యవహారమే..’ అంటూ ఎద్దేవా చేశారు.

కొత్త సాగు చట్టాల్ని రైతులు వ్యతిరేకిస్తే, ఆ నల్ల చట్టాల్ని రద్దు చేయడానికి కేంద్రం 13 నెలల సమయం తీసుకుందనీ, 13 రోజుల వ్యవధిలో సమస్యను పరిష్కరించి వుంటే, పదుల సంఖ్యలో రైతులు ప్రాణాలు నిలిచేవని కేసీయార్ అన్నారు.
గతానికి భిన్నంగా కేసీయార్ మీడియా సమావేశం సాగింది. ఆయన చెప్పాలనుకున్నది చెప్పేశారు తప్ప, మీడియా ప్రశ్నించడానికి అవకాశమివ్వలేదు. గతంతో పోల్చితే కేసీయార్ ప్రసంగంలోనూ పస తగ్గినట్లే కనిపిస్తోంది.