కొత్త, పాత, మళ్ళీ కొత్త. తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏం చెబితే అదే వేదం. గతంలో అలా అన్నారు కదా, ఇప్పుడిలా ఎందుకు మాట్లాడుతున్నారు.? అని ఎవరన్నా ప్రశ్నిస్తే, ‘మీరు తెలంగాణ వ్యతిరేకులు’ అని ఎవరి మీదైనా ముద్ర వేసెయ్యగలరాయన. కేసీఆర్ తాజాగా, తెలంగాణ అసెంబ్లీలో నీళ్ళ పంచాయితీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘నీళ్ళ విషయమై రాజీ పడే ప్రసక్తే లేదు. ఏపీతో ఈ విషయమై రాజీపడబోం.. అవసరమైతే ఎందాకైనా కొట్లాడతాం..’ అని కేసీఆర్ సెలవిచ్చారు. ‘ఇరు రాష్ట్రాలూ కూర్చుని చర్చించుకుంటే సమస్య పరిష్కారమవుతుంది..’ అని మొన్నామధ్య వైఎస్ జగన్‌తో ప్రగతి భవన్‌లో చర్చల సందర్భంగా ఇదే కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇంకోసారి రాయలసీమ వెళ్ళినప్పుడు, ‘నేను మీకు పెద్దన్నని..’ అని వైసీపీ నేతల యెదుట చెప్పారు. నిజానికి, ఆంధ్రపదేశ్ – తెలంగాణ మధ్య ‘కొట్టుకునేంత’ స్థాయిలో నీళ్ళ సమస్యలు లేవు. రాష్ట్రాల మధ్య చిన్న చిన్న జల వివాదాలు మామూలే.
ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయిన నేపథ్యంలో ఆంధ్రపదేశ్, తెలంగాణ మధ్య సర్దుబాట్లు జరగాల్సి వుంది. ఈ క్రమంలో గతంలో చంద్రబాబు ప్రభుత్వం వున్నప్పుడు ఏకంగా ప్రాజెక్టుల మీద ఇరు రాష్ట్రాల ప్రజలు, అధికారులు కొట్టుకునేదాకా వెళ్ళింది పరిస్థితి. అది రాజకీయం. ఆ తర్వాత ఆ రాజకీయ వేడి తగ్గింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలోనేమో.. కేసీఆర్ ఏపీతో నీటి వివాదం విషయమై ఘాటు కామెంట్స్ చేశారు. చర్చలతో ఎంతటి పెద్ద సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. బాబ్లీ ప్రాజెక్టుతో తెలంగాణ ఎడారిగా మారిపోతుంది.. కానీ, మహారాష్ట్రతో సన్నిహితంగానే వుంటోంది తెలంగాణ. ఆల్మట్టి ఎత్తు పెంపుతోనూ తెలంగాణకి నష్టమే. కానీ, కర్నాటకతో తెలంగాణకు వివాదాల్లేవు. ఏపీతో తెలంగాణ వివాదాలనేవి కేవలం.. రాజకీయ పరమైన వివాదాలు మాత్రమే.