KCR Orders : కేసీయార్ చెప్తే పనైపోయినట్లే.! నమ్మాల్సిందే సుమీ.!

KCR Orders : తెలంగాణలో ఇకపై డ్రగ్స్ జాడ కనిపించకూడదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, సంబంధిత శాఖల ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో స్పష్టంగా తేల్చి చెప్పారు. ప్రత్యేకంగా నిఘా పెట్టి మరీ డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టాల్సిందిగా అధికారుల్ని ఆదేశించేశారు కేసీయార్.
ఆఘమేఘాల మీద ముఖ్యమంత్రి కేసీయార్, ఇంత సీరియస్‌గా సమీక్ష నిర్వహించేసి, కీలక ఆదేశాలు జారీ చేసేశారంటే.. ఇకపై తెలంగాణలో డ్రగ్స్ వాడకం అన్న మాటే వినిపించదేమో.! ఆగండాగండీ, మరీ అంత తొందరపడిపోవద్దు.

డ్రగ్స్ ఎక్కువగా పబ్బుల్లోనూ, పార్టీల్లోనూ సర్క్యులేట్ అవుతున్నాయి. ఎక్కువగా హై ప్రొఫైల్ వ్యక్తులే డ్రగ్స్‌కి బానిసలుగా మారుతున్నారు. కాలేజీలకూ పాకుతోంది ఈ మహమ్మారి. అంతేనా, స్కూలు విద్యార్థులకూ వారికి తెలియకుండా డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు కొందరు కేటుగాళ్ళు.

ఇంతా జరుగుతున్నా, నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్లు.? సంబంధిత శాఖల అధికారులు ఏం చేస్తున్నట్లు.? కష్టపడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు.. కానీ, కేసులే నిలబడటంలేదు. గతంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులపై ఆరోపణలు వచ్చాయి, ఆ కేసు కలక్రమంలో అటకెక్కింది.. సినీ నటులు క్లీన్ చిట్ పొందారు.

అడపా దడపా ప్రముఖ పబ్బుల్లో డ్రగ్స్ గురించిన వార్తలొస్తున్నాయి. ఆ తర్వాత అంతా మామూలే. ఎందుకిలా.? ప్రజా ప్రతినిథుల సిఫార్సులతో కేసులు నమోదు చేయకుండా వుండొద్దు.. అలాంటి సిఫారసులను తిరస్కరించాలంటూ ముఖ్యమంత్రి కేసీయార్, అధికారుల్ని ఆదేశించారట. అదసలు సాధ్యమేనా.?

ఒక్కటి మాత్రం నిజం.. హైద్రాబాద్ విశ్వనగరంగా మారుతోంది. ఈ విశ్వనగరానికి డ్రగ్స్ మరక అత్యంత హేయం.