తెలంగాణ సాధన పునాది ఉద్యమమే. అలాంటి ఉద్యమ స్ఫూర్తితో ఎదిగిన రాష్ట్ర యువత ఇప్పుడు మత్తు మాయలో మునిగి పోతుండటం ఎంతో బాధాకరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శిల్పకళా వేదికలో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సభలో ఆయన యువతకు బలమైన సందేశం ఇచ్చారు.
వార్తల్లో యువత డ్రగ్స్ బారిన పడుతున్న దృశ్యాలు చూస్తుంటే గుండెతట్టుకోవడం లేదని ఆయన అన్నారు. ఉద్యమాల ద్వారా రాష్ట్రాన్ని సాధించాం. ఇప్పుడు మళ్ళీ ఒక ఉద్యమం కావాలి.. అది కూడా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా. ఇది మన తరం బాధ్యత అని సీఎం పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలపై యుద్ధం ప్రకటించామని గుర్తుచేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. అమ్మేవారైనా, వాడేవారైనా ఎవరినీ ఉపేక్షించమని హెచ్చరించారు. ఏ విద్యా సంస్థలో డ్రగ్స్ పట్టుబడితే సదరు సంస్థపైనే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎవరూ తప్పించుకోలేదని హెచ్చరించారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గురించి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రత్యేకంగా చెప్పారు. చిరంజీవి గారు 50 ఏళ్లుగా కఠోర శ్రమతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఆయన కుటుంబం కూడా డ్రగ్స్ అనే పదానికి దూరంగా ఉంది. అలాంటి చిత్తశుద్ధి అందరికీ ఆదర్శం కావాలన్నారు. ప్రతి యువకుడు తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకుని, విజయపథంలో దూసుకెళ్లాలని పేర్కొన్నారు. సినిమా అయినా, ప్రభుత్వం అయినా, ఏ రంగమైనా రాణించాలని పేర్కొన్నారు. డ్రగ్స్ వాడితే లక్ష్యం నశిస్తుంది, కుటుంబం నాశనం అవుతుందని అని హెచ్చరించారు.
పంజాబ్ ఉదాహరణను చెబుతూ దేశానికి యుద్ధవీరులను అందించిన రాష్ట్రం ఇప్పుడు డ్రగ్స్‌కు కేంద్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే పరిస్థితి మన రాష్ట్రానికి రాకూడదన్న సీఎం.. యువత క్రీడల్లో పాల్గొనాలిని.. ఆరోగ్యవంతమైన సమాజమే అభివృద్ధికి బాటలు వేస్తుందని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమానికి సినీ హీరోలు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ హాజరై యువతకు ప్రేరణనిచ్చారు. యువత మారాలని, రాష్ట్రం ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.