Sri Ram arrest: డ్రగ్స్ కేసులో తమిళ హీరో శ్రీరామ్ అరెస్ట్ కావడం కోలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది. పక్కా సమాచారంతో శ్రీరామ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన వద్ద నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు.
విచారణ అనంతరం చెన్నై ఎగ్మోర్ కోర్టులో శ్రీరామ్‌ను హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు జులై 7వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను జైలుకు తరలించారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న శ్రీరామ్‌ను తమ కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు భావిస్తున్నారు. కస్టడీలోకి తీసుకుని మరింత సమాచారం రాబట్టాలని యోచిస్తున్నారు. దీంతో డ్రగ్స్ నెట్‌వర్క్‌తో ఇంకెంతమంది కోలీవుడ్ ప్రముఖులకు సంబంధాలు ఉన్నాయో తేలుతుందంటున్నారు. ఈమేరకు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు.
కాగా అన్నాడీఎంకే పార్టీ మాజీ కార్యనిర్వాహకుడు ప్రసాద్ డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉంటాడు. డ్రగ్స్ సరఫరాపై సమాచారం అందుకున్న చెన్నై పోలీసులు ప్రసాద్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరి విచారణలో భాగంగా శ్రీరామ్‌కు తాము డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు నిందితులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే శ్రీరామ్ ను అరెస్ట్ చేశారు.
ఏపీలోని తిరుపతికి చెందిన శ్రీరామ్.. సినిమా అవకాశాల కోసం చెన్నై వెళ్లారు. తమిళంలో పలు సినిమాల్లో హీరోగా చేశాడు. అలాగే తెలుగులోనూ కొన్ని సినిమాల ద్వారా దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, నిప్పు వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టారు. ఇటీవల హరికథ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను అలరించాడు.