ఈటెల రాజేందర్‌ని పూర్తిగా లైట్ తీసుకున్న కేసీయార్.!

హుజూరాబాద్ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి బంపర్ మెజార్టీతో విజయం సాధిస్తుందనే ధీమాతో వున్నారు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ‘ఈటెలను పట్టించుకోవద్దు. ఆయనతో అయ్యేది లేదు, పోయేది లేదు. ప్రజలకు చేరువయ్యేందుకు మరింతగా ప్రయత్నిద్దాం.. రికార్డు మెజార్టీ మీదనే ఫోకస్ పెడదాం.. విపక్షాల ట్రాప్‌లో పడొద్దు..’ అంటూ పార్టీ శ్రేణులకు కేసీయార్ దిశా నిర్దేశం చేశారు. దళిత బంధు కార్యక్రమం దేశానికే ఆదర్శం కాబోతోందన్న కేసీయార్, ఈ పథకం విషయంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదన్నారు.

దుబ్బాకలో జరిగిన పొరపాట్లను నాగార్జునసాగర్‌లో రిపీట్ చేయలేదు కాబట్టే, విజయం తేలికయ్యింది. హుజూరాబాద్ విషయంలో మరింత అప్రమత్తంగా వుండాలి.. అని కేసీయార్, పార్టీ ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి ఇంకే పార్టీ పోటీ కాదన్నది కేసీయార్ వాదన. కాగా, కేసీయార్‌ని రాజకీయంగా దెబ్బకొట్టడమే లక్ష్యంగా ఈటెల పెట్టుకున్నట్లు ఆయన సన్నిహితులు ప్రచారం చేస్తున్న విషయం విదితమే. కేసీయార్‌ని గద్దె దించుతానని ఈటెల శపథం చేసేస్తున్నారు హుజూరాబాద్ నియోజకవర్గంలో చేస్తోన్న పాదయాత్రలో భాగంగా. మరోపక్క, అధికార పార్టీ ధీమాతో భారతీయ జనతా పార్టీ మరింత అప్రమత్తమయ్యింది. నిన్న మొన్నటిదాకా ఈటెల విషయమై కొంత అంటీ ముట్టనట్టు వ్యవహరించిన బీజేపీ శ్రేణులు, ఇప్పుడు ఆయన వెంట పాదయాత్రలో ఎక్కువగానే కనిపిస్తున్నారు. కాగా, హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయమై కాంగ్రెస్ పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయమై తెరవెనుక తన వ్యూహాల్ని పక్కగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీయార్ ఎంత లైట్ తీసుకున్నా హుజూరాబాద్ ఉప ఎన్నికలో ముక్కోణపు పోటీ అయితే తప్పదు.