హైదరాబాద్ లో సచివాలయాన్ని కేసీఆర్ సర్కార్ కూల్చేసి కొత్త సచివాలయం నిర్మాణానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. మంగళవారం సచివాలయం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. అలాగే కొత్త సచివాలయం నమూనాని సీఎంవో కార్యాలయం విడుదల చేసింది. అయితే సచివాలయం కూల్చివేతపై…కొత్త సచివాలయం నమునాపై బీజీపే ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిజాం తన పేరు చిరకాలం ఉండాలని చార్మినార్, అసెంబ్లీ నిర్మిస్తే.. కేసీఆర్ తన పేరుచిరకాలం నిలిచి పోవాలనే ఉద్దేశంతో ఉన్న దాన్ని కూల్చేసి కొత్త సచివాలయం నిర్మిస్తున్నారని మండిపడ్డారు.
50 ఏళ్ల వరకూ ఆ భవనం పనిచేస్తుందని నిపుణులు చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. కేవలం తన పేరు కోసం మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. కొత్త సచివాలయం నమునా మజీద్ హజ్ హౌజ్ లా ఉందని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఎనిమిదవ నిజాంలా తయారయ్యారని దుయ్యబెట్టారు. కేసీఆర్ కి ఈ కొత్తనమునా ఎంఐఎం నేతలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో కడుతోన్న సచివాలయం అందరి అభియిష్టాల మేరకు ఉండాలన్నారు.
ఓవైపు కరోనాతో ప్రజలు చనిపోతుంటే..పట్టించుకోకుండా ఇలాంటి పరిస్థితుల్లో 500 కోట్లు పెట్టి సచివాలయం కట్టడం అవసరమా? అని ప్రశ్నించారు. కేసీఆర్ చేస్తోన్న ఈ పనిని ఉన్మాద చర్యగా నాగం జనార్ధన్ రెడ్డి దుయ్యబెట్టారు. కరోనా కాలంలో ఇవేం పనులని మండిపడ్డారు. ఆరు నెలలు పాటు ఆగితే వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు. అలాగే సచివాలయాన్ని కరోనా రోగులకు ఎందుకు వాడలేదని..ఆ మాత్రం ఆలోచన కేసీఆర్ రాలేదా? అని నాగం ద్వజమెత్తారు.