KCR National Politics : ఈ బక్కోడే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది.! ఈ బక్కోడే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోయేది.! ఇదీ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల గురించి తరచూ చెప్పే మాట.!
ఎవరన్నారు కేసీయార్ బక్కోడు అని.? రాజకీయంగా పదునైన వ్యూహాల్ని రచించడంలో కేసీయార్ దిట్ట. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి, తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిన దగ్గర్నుంచి, ఓ సందర్భంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని, ఆ తర్వాత వామపక్షాల్నీ కలుపుకుపోయి, ఒకానొక సందర్భంలో తెలుగుదేశం పార్టీతోనూ పొత్తు పెట్టుకున్న ఘనుడు కేసీయార్.
‘నేనేం చేసినా తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే..’ అని కేసీయార్ చెబుతూ వచ్చేవారు. ఈ క్రమంలో ఆయన చాలాసార్లు రాజకీయాల్లో తడబడ్డారు, కానీ.. నిలదొక్కుకున్నారు. ‘ఔను, కేసీయార్ ఏం చేసినా తెలంగాణ కోసమే..’ అని తెలంగాణ ప్రజానీకం నమ్మేలా చేయగలిగారు కేసీయార్. ఫలితం, తెలంగాణ ఉద్యమం కేసీయార్ కేంద్ర బిందువుగా చేసుకుని ఉధృతమయ్యింది.. తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యింది.
ఈ క్రమంలో దళితుడే తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి.. అని చెప్పిన కేసీయార్ మాట మార్చారు. తొలి దఫా అవకాశం ఇవ్వలేదు.. రెండో దఫా కూడా దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు కేసీయార్ నిరాకరించారు. ముచ్చటగా మూడోసారీ ఆ అవకాశం వుండదు. అయినాగానీ, కేసీయార్ ఏం చెప్పినా తెలంగాణ సమాజం నమ్ముతుంది.. నమ్మేలా కేసీయార్ చేయగలరు.
మరి, గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో ఎందుకు బీజేపీ చేతిలో చావు తప్పి కన్ను లొట్టబోయిన చందాన గెలిచినట్టు.? లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఎలా తెలంగాణ రాష్ట్ర సమితికి గట్టి పోటీ ఇవ్వగలిగినట్టు.? దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి ఎలా ఎదురు దెబ్బలు తగిలినట్లు.? ఇవి కూడా ఆలోచించాల్సిన విషయాలే.
పెద్ద నోట్ల రద్దు ఓ ఫెయిల్యూర్ అని తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు చెబుతోంది. కోవిడ్ విషయంలోనూ కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించలేదన్ని కేసీయార్ ఆరోపణ. వీటిల్లో వాస్తవాలు లేకపోలేదు. మరెందుకు, చాలా విషయాల్లో కేంద్రానికి పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతిచ్చినట్లు.? అదే మరి, కేసీయార్ రాజకీయ వ్యూహాలంటే.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మళ్ళీ గెలవడం కేసీయార్ ముందున్న పెద్ద టాస్క్. ఇక, జాతీయ రాజకీయాలంటారా.? ఇప్పటికైతే అది పబ్లిసిటీ స్టంట్ మాత్రమే. ఏమో, గుర్రం ఎగరావచ్చు.. కేసీయార్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనూవచ్చు.!
దేశంలో వున్న సమస్యల గురించి కేసీయార్ అనర్గళంగా మాట్లాడేస్తున్నారు. కానీ, ఇవే మాటలు పార్లమెంటు సమావేశాల్లో తమ ఎంపీల ద్వారా కేసీయార్ ఎందుకు చెప్పించలేకపోయినట్టు.? గతంలో కేసీయార్ కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. మరి అప్పట్లో ఆయనెందుకు దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్ళేలా అప్పటి తమ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోయారు.? ఇలాంటి ప్రశ్నల్నీ ఖచ్చితంగా చర్చకు వస్తాయి.
జాతీయ స్థాయిలో చక్రం తిప్పడమంటే, బహిరంగ సభల్లో మాట్లాడినంత తేలిక కాదు. దేశ వ్యాప్తంగా వున్న ప్రజల్ని ప్రభావితం చేయగలగాలి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లోని సమస్యల గురించి మాట్లాడగలగాలి. లేదా, ఇతర పార్టీలతో కలిసి ముందడుగు వేయాలి. ఇప్పటికే అలా కలిసి ముందడుగు వేసేందుకు కేసీయార్ చేసిన ప్రయత్నాలేవీ సత్ఫలితాలను సాధించలేదు. మరెలా, జాతీయ రాజకీయం కేసీయార్ చేసేది.?