తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ద్వారా సంచలనాలు సృష్టించాలని భావిస్తుండగా అలా జరగడం సాధ్యమేనా అని రాజకీయ విశ్లేషకుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ కావాలని చేయకపోయినా ఏపీకి పరోక్షంగా చేసిన ద్రోహం అంతాఇంతా కాదు. ప్రస్తుతం ఏపీకి రాజధాని లేకుండా ఉండటానికి పరోక్షంగా సీఎం కేసీఆర్ కారణమని చెప్పవచ్చు. జగన్ మద్దతు ఉంటే మాత్రమే ఏపీలో బీఆర్ఎస్ కు భవిష్యత్తు ఉంటుంది.
అన్ని స్థానాలలో కాకుండా వైసీపీ బలంగా లేని స్థానాలలో బీఆర్ఎస్ పోటీ చేస్తే మాత్రం ఈ పార్టీకి వైసీపీ నుంచి పరోక్షంగా సహాయసహకారాలు లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మరోవైపు పార్టీని ప్రకటించిన తర్వాత కేసీఆర్ వేస్తున్న అడుగులు రాజకీయ విశ్లేషకులను సైతం ఒక విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తుండటం గమనార్హం. సౌత్ మినహా ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కు గుర్తింపు రావడం తేలిక కాదు.
ఈ కారణం వల్లే కేసీఆర్ ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి ముందుకెళ్లే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. బీజేపీ, కాంగ్రెస్ లకు భారీ షాక్ ఇచ్చే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా ఏదైనా అనుకుంటే కేసీఆర్ మొండిగా ముందుకు వెళతారని పొలిటికల్ వర్గాల్లో చాలామంది భావిస్తారు. ఆ మొండితనం కేసీఆర్ కు ఒక విధంగా ప్లస్ అయితే మరో విధంగా మైనస్ అని చెప్పవచ్చు.
అయితే అధికారంలోకి రావడానికి వ్యూహాలను సిద్ధం చేయడంలో కేసీఆర్ ముందువరసలో ఉంటారు. అందువల్ల కేసీఆర్ ను తక్కువ అంచనా వేయడం కూడా కరెక్ట్ కాదని మరి కొందరు భావిస్తున్నారు. కేసీఆర్ తెలంగాణలో ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలనే ఇతర రాష్ట్రాలలో కూడా అమలు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి రావడానికి ప్రయత్నించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.