KCR Mark Dirty Politics : కేసీయార్ మార్కు తిట్ల దండకం.!

KCR Mark Dirty Politics : రాజకీయాల్లో తిట్టడం నేర్పించడం కోసం ఏదన్నా యూనివర్సిటీ పెట్టాల్సి వస్తే, దానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రిన్సిపల్ అవ్వాల్సిందే. కేంద్ర బడ్జెట్టుపై మాట్లాడేందకు మీడియా ముందుకొచ్చిన కేసీయార్, తిట్ల దండకం అందుకున్నారు. ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రి.. ఇలా ఒకరేమిటి, అందర్నీ తూలనాడేశారు కేసీయార్ తనదైన శైలిలో.

సిగ్గుందా.? అన్నారు. పచ్చి దొంగలన్నారు.. ఇంకా రాయడానికి వీల్లేని భాషలో తిట్ల వర్షం కురిపించారు. కేసీయార్, కేంద్ర బడ్జెట్టు గురించి మాట్లాడాలనుకున్నారా.? కేంద్రాన్ని తిట్టాలనుకున్నారా.? బీజేపీని తూలనాడేందుకే మీడియా ముందుకొచ్చారా.? జర్నలిస్టులకే అర్థం కాలేదు ఏం జరుగుతోందో.

రెండున్నర గంటల పాటు ఏకధాటిగా కొనసాగింది కేసీయార్ తిట్ల ప్రవాహం. రాజ్యాంగాన్ని మార్చేయాలన్నారు.. కొత్త రాజ్యాంగం రాసుకోవాలన్నారు. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీని దించేస్తామన్నారు.. దానికోసం వ్యూహాలు రచిస్తున్నామన్నారు. కేసీయార్ ఏవేవో చెప్పారు.

నచ్చిన తిట్లు తిట్టేసింది చాలక, ‘ఇదిగో కేసీయార్ ఇలా తిట్టాడంటూ రేప్పొద్దున్న కొన్ని కుక్కలు మొరుగుతాయ్..’ అంటూ రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడిపోయారు. తెలంగాణకు కేంద్రం ఏమీ చేయలేదన్నారు, ఏడేళ్ళు సంయమనం పాటించాం.. ఇకపై తగ్గేదే లేదన్నారు.

వెరసి కేసీయార్ ప్రసంగమంతా తిట్లతోనూ, శాపనార్థాలతోనూ, హెచ్చరికలతోనూ నిండిపోయింది. ఏంటీ, ఇదంతా నిజమేనా.? ఫెడరల్ ఫ్రంట్ విషయంలో కేసీయార్ ముందడుగు వేయబోతున్నారా.? ఏడేళ్ళుగా ఇదే ముచ్చట. ఇందులో మార్పేమీ వుండదు.

మళ్ళీ కేసీయార్ మీడియా ముందుకొస్తారు, నాలుగు తిట్లు తిట్టి వెళతారు. అంతే, అంతకు మించి ఏమీ జరగదు.