KCR Health Issue : కేసీయార్‌కి అనారోగ్యం: ఇది ప్రశాంత్ కిశోర్ వ్యూహం.?

KCR Health Issue : అన్నిటికీ అతడే కారణమనడం ఎంతవరకు సబబు.? అయినాగానీ, అన్నీ ఒకే ఫార్మాట్‌లో జరుగుతున్నప్పుడు ఒకింత అనుమానాలు కలగడం కూడా సబబే.!

తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వల్ప అనారోగ్య సమస్యలతో నిన్న హైద్రాబాద్‌లోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. ఆయన స్ట్రెచర్ మీద ఆసుపత్రికి వెళ్ళడంతో ఒక్కసారిగా అంతా నిర్ఘాంతపోయారు. కేసీయార్‌ని అలా చూసి చాలామందికి చివుక్కుమంది.

ఎప్పుడూ కేసీయార్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడే బీజేపీ నేత బండి సంజయ్ కూడా, కేసీయార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.. ఎక్కడా రాజకీయ విమర్శల జోలికి పోలేదు. కాస్సేపటికి అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్ట్రెచర్ మీద ఆసుపత్రికి వెళ్ళిన కేసీయార్, కొన్ని వైద్య పరీక్షల అనంతరం తనంతట తానే స్వయంగా నడచుకుంటూ బయటకు వచ్చారు.

కేసీయార్ కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చాలాకాలంగా ఆయనకు వైద్య చికిత్స అందిస్తోన్న సీనియర్ వైద్యుడొకరు వెల్లడించారు. అన్ని వైద్య పరీక్షలూ చేశామనీ, ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలూ లేవని, అన్ని పరీక్షల్లోనూ ‘నార్మల్’ అనే వచ్చిందని సదరు సీనియర్ వైద్యుడు పేర్కొన్నారు.

‘అబ్బే, ఇదంతా కేవలం ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహంలో భాగం. ఇదొక పొలిటికల్ స్టంట్ మాత్రమే..’ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జోరందుకుంది. వైఎస్ జగన్ కోడి కత్తి, మమతా బెనర్జీ కాలి నొప్పి, కేసీయార్.. ఇదిగో ఇలా.. అంటూ ఇతర రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ మార్కు పబ్లిసిటీ స్టంట్లను ప్రస్తావిస్తున్నారు నెటిజన్లు.