KCR Haters :కేసీయార్ బాధితులంతా బీజేపీ గూటికే.. సీక్రెట్ ఏంటో.!

KCR Haters : కేసీయార్ బాధితులంతా ఒకరొకరుగా భారతీయ జనతా పార్టీ వైపు వెళుతున్నారు. ఓ వైపు బీజేపీకి టీఆర్ఎస్ పార్టీ ‘బీ-టీమ్’ అనే విమర్శలు వినిపిస్తోంటే, ఇంకోపక్క బీజేపీ – టీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నాశనం చేసేందుకు బీజేపీ – టీఆర్ఎస్ ఆడుతున్న నాటకంగా కొందరు అభివర్ణిస్తున్నారు తాజా పరిణామాల్ని.

సరే, బీజేపీ – టీఆర్ఎస్ మధ్య అసలు వున్నదేంటి.? వైరమా.? స్నేహమా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, కేసీయార్ కారణంగా ఇబ్బందులు పడుతున్నవారంతా భారతీయ జనతా పార్టీని షెల్టర్ జోన్‌లా భావిస్తున్నారు. ఈ కోవలో చాలామంది నేతలు ఇప్పటికే బీజేపీ వైపుకు వెళ్ళిపోయారు.. కొత్తగా బీజేపీలోకి చేరికలు జరుగుతూనే వున్నాయి.

లేటెస్ట్ ఎంట్రీ తీన్మార్ మల్లన్న. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మీద తెలంగాణ సర్కార్ గుస్సా అవుతోంది. కేసీయార్ ఆదేశాలతోనే తీన్మార్ మల్లన్నపై కేసులు నమోదయ్యాన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది.

ఇక, తీన్మార్ మల్లన్న ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వేదికగా తెలంగాణలో కేసీయార్ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తూ వచ్చారు. అరెస్టుల ప్రసహనం తర్వాత, తీన్మార్ మల్లన్న కీలక నిర్ణయం తీసుకున్నారు.. బీజేపీలో చేరిపోయారు. ‘అబ్బే, నేను బీజేపీలో చేరడం వెనుక వేరే కారణాలేవీ లేవు..’ అని ఆయన చెబుతున్నా, కారణం సుస్పష్టం.. కేసీయార్ నుంచి తప్పించుకోవడంమే ఆ కారణం.
మొన్న ఈటెల రాజేందర్, తాజాగా తీన్మార్ మల్లన్న.. తర్వాత ఎవరు.?