దుబ్బాకలో నవంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానమైన పోటీ తెరాస, కాంగ్రెస్ పార్టీల మధ్యనే నెలకొని ఉంది. తెరాస తరపున సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత బరిలో ఉండగా కాంగ్రెస్ నుండి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉన్నారు. తెరాసకు ఇది సిట్టింగ్ స్థానం కావడం, సానుభూతి అంశం ఉండటంత కలిసొచ్చే అంశాలు కాగా చిరుకు శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి నియోజకవర్గం, ఆ చుట్టుపక్కల మంచి పలుకుబడి, కేడర్ ఉండటం బలాలుగా ఉన్నాయి. తెరాసను గెలిపించుకోవడానికి మంత్రి హరీష్ రావు సర్వ శక్తులు మోడీ తీవ్రంగా కృషి చేస్తుండగా శ్రీనివాస్ రెడ్డి గెలుపుకోసం కాంగ్రెస్ పెద్దలంతా దుబ్బాకలోనే తిష్ట వేశారు.
పోటీ రసవత్తరంగా ఉండటంతో గెలుపు ఎవరిదో ఖచ్చితంగా చెప్పడం కష్టమైపోయింది. బొటాబొటీ మెజారిటీతో కాంగ్రెస్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు విశ్లేషకులు. తెరాస గెలిస్తే పెద్ద హడావుడి ఉండకపోవచ్చు కానీ కాంగ్రెస్ గెలిస్తే మాత్రం తర్వాతి రాజకీయ పరిణామాలు మరింత ఉత్కంఠగా ఉంటాయని చెప్పుకుంటున్నారు. అందుకు కారణం కేసీఆర్ వద్ద ఉన్న ప్లాన్ ‘బి’ అని అంటున్నారు. ప్లాన్ బి ఉండబట్టే కేసీఆర్ ఎన్నికల విషయంలో నిమ్మళంగా ఉన్నారట. ఇక్కడ ప్లాన్ బి అంటే కాంగ్రెస్ తరపున శ్రీనివాస్ రెడ్డి గెలిస్తే ఆయనకు గాలం వేయడమేనట.
అవును.. దుబ్బాకలో శ్రీనివాస్ రెడ్డి విజయం సాధిస్తే కొన్ని రోజులు మౌనంగా ఉండి ఆ తర్వాత ఆయన్ను తెరాసలోకి లాగాలని కేసీఆర్ భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉంటే ఏం వస్తుంది.. అధికార పక్షంలో ఉంటేనే కదా ఏమన్నా చేయగలిగేది అంటూ శ్రీనివాస్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించి, అవసరమైతే మంత్రి పదవి ఎరవేసి తమవైపు తిప్పుకోవాలని తెరాస పథక రచన చేస్తోందట. ఎలాగూ శ్రీనివాస్ రెడ్డికి తెరాసలో బడా లీడర్లతో మంచి సాన్నిహిత్యం ఉంది. మంతనాలు చేయడం కూడ సులభం. ఈ విషయాన్నే ఎన్నికల ప్రచారంలో బీజేపీ హైలెట్ చేస్తోంది. శ్రీనివాస్ రెడ్డి గెలిచినా ఆయన మజిలీ కేసీఆర్ వద్దకేనని చెబుతున్నారు. మరి ఇన్ని అనుమానాలు, ప్రభావాల నడుమ దుబ్బాక ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి.