KCR Graph Fall Down : కేసీయార్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయిందా.?

KCR Graph Fall Down : ఒక్క తప్పటడుగు.. కేసీయార్ ఇమేజ్ అదఃపాతాళానికి పడిపోయేలా చేసిందా.? ఔననే అనాలేమో. ప్రధాని నరేంద్ర మోడీ హైద్రాబాద్ పర్యటనలో ఆయన వెంట కేసీయార్ లేకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇటీవల కేంద్ర బడ్జెట్ వ్యవహారంపై కేసీయార్ స్పందిస్తూ, ప్రధానిపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.

ఆ మంటతోనే కేసీయార్, ప్రధాని పర్యటనకు దూరంగా వున్నారన్న ప్రచారం జరుగుతోంది. అదేమీ లేదు, స్వల్ప అనారోగ్యంతోనే కేసీయార్, అలా ఆ పర్యటనకు దూరమవ్వాల్సి వచ్చిందనే వాదన తెలంగాణ ప్రభుత్వం నుంచి వినిపిస్తోంది.

కారణం ఏదైనా, అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో ప్రధాని వెంట కేసీయార్ లేకపోవడం ఖచ్చితంగా అనుమానాలకు తావిస్తుంది. సోషల్ మీడియా వేదికగా కేసీయార్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. దానికి కౌంటర్ ఇస్తూ గులాబీ శ్రేణులు తమ అధినేతను వెనకేసుకొస్తూ, బీజేపీ మీద విరుచుకుపడ్డాయి కూడా.

సరే, బీజేపీ – టీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు సంగతెలా వున్నా, ప్రధాని పర్యటన విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, ఒకింత హుందాతనం ప్రదర్శించి వుండాల్సింది. అది ఆయన బాధ్యత కూడా.
కేసీయార్, ప్రధాని వెంట లేకపోవడం, సమతామూర్తి రామానుజుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొనకపోవడం.. వెరసి, కేసీయార్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయిందనే చర్చ జరుగుతోంది. కేసీయార్ అభిమానులు కూడా ఈ విషయంలో తమ అభిమాన నాయకుడ్ని సమర్థించలేకపోతున్నారు.