తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ నడుమ మంచి స్నేహానుబంధం ఉండేది. ఇద్దరూ ఒకరికొకరు అన్నదమ్ముల్లా ఉండేవారు. బేసిన్లు, బేషజాలు వద్దని ఇకపై జలవివాదలు ఉండవని ఉమ్మడి వాక్కు పలికారు. కానీ ఏడాది తిరగకుండానే గొడవలు మొదలయ్యాయి. అదే నదీ జలాల విషయంలో మనస్పర్థలు పొడచూశాయి. ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం నిబంధనలకు విరుద్ధమని, దాని వలన తెలంగాణ జిల్లాలు ఎండిపోతాయని కేసీఆర్ అభ్యంతరం తెలిపితే అసలు కాళేశ్వరం సహా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అన్న నీటి ప్రాజెక్టులు అక్రమమేనని జగన్ అడ్డం తిరిగారు. దీంతో వాటర్ వార్ పెద్దదైంది. నదీ యాజమాన్య బోర్డులు, కేంద్రం పెద్దలు కలుగజేసుకున్నా పరిష్కారం దొరకలేదు.
ఈ నేపథ్యంలో సందర్భం వచ్చినప్పుడల్లా ఎత్తిపొడుపులు, మోకాలొడ్డడాలు షరా మామూలు అయ్యాయి. వైఎస్ జగన్ విశాఖపట్నాన్ని పాలన రాజధానిగా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. హైకోర్టు స్టేటస్ కో ఇచ్చినప్పటికీ శాఖల తరలింపుకు పతాక రచన చేసుకుంటున్నారు. ప్రధాన శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలను వెతుకుతున్నారు. ఇప్పటికే కొన్నింటిని సిద్ధం చేస్తున్నారు. ఈ తరలింపుల్లో భాగంగా జల వనరుల శాఖ ఉత్తరాంధ్ర సీఈ కార్యాలయ ఆవరణలో కృష్ణా బోర్డు కార్యాలయం, జల వనరుల శాఖ ప్రధాన కార్యాలయం ఏర్పాటుచేయాలని చూస్తున్నారు. అసలు కృష్ణా నదికి ఏమాత్రం సంబంధంలేని విశాఖలో కృష్ణా నదీ బోర్డును తరలించడంలో ఏమాత్రం అర్థంలేదని చాలామంది అంటున్నారు.
కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అనుకున్నదే చేయడానికి సిద్ధమైంది. ఈ సమయంలోనే కేసీఆర్ ఎంట్రీ ఇచ్చారు. కృష్ణా నాదీ బోర్డును విజయవాడకు తరలిస్తామని అన్నారు కాబట్టే ఒప్పుకున్నామని, విశాఖకు తీసుకువెళ్తామంటే ఒప్పుకునేవారం కాదని, సంబంధంల లేని ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల కార్యకలాపాలకు ఇబ్బందులు తలెత్తుతాయని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ రావు అంటున్నారు. విశాఖకు తరలింపుకు ఒప్పుకునేది లేదని కేఆర్ఎంబీకి లేఖ ద్వారా తెలిపారు.
గతంలో రాజధాని కాబట్టి హైదరాబాద్ నరాగరంలో కృష్ణా నదీ బోర్డు ఉండేది. బోర్డును విజయవాడలో ఏర్పాటు చేస్తామంటేనే తరలింపుకు ఒప్పుకున్నామని వివరించింది. విశాఖలో ఉంటే కార్యకలాపాలకు ఇబ్బందులు వస్తాయని తేల్చి చెప్పింది. ఎపెక్స్ కమిటీలో చర్చించకుండా విశాఖలో ఏర్పాటు చేస్తామనడం సరికాదని స్పష్టం చేసింది. ఒకవైపు జగన్ అన్ని శాఖల ప్రధాన కార్యాలయాలను విశాఖలో పెట్టేసి నయా రాజధానికి ప్రాముఖ్యత తీసుకురావాలని ట్రై చేస్తుంటే ఇలా కేసీఆర్ సర్కార్ అడ్డుతగలడం ఆయనకు షాకింగ్ విషయమే.