ఏదో అనుకుంటే, ఇంకోటేదో అయ్యింది.. అన్నట్టు మారింది పరిస్థితి. దళిత బంధు పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ప్రారంభించాలనుకున్న విషయం విదితమే. అయితే, ఈ వ్యవహారంపై నానా యాగీ జరిగింది. దాంతో, కేసీయార్ తన వ్యూహాన్ని మార్చుకున్నారు. ప్రజల్లోకి ముఖ్యమంత్రి.. అంటూ, నిన్ననే వాసాలతిప్ప గ్రామంలోని దళితవాడను సందర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, అక్కడి నుంచే దళిత బంధు పథకాన్ని ప్రారంభించేసినట్లు ప్రకటించడం గమనార్హం. ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించడం ఈ దళిత బంధు పథకం ఉద్దేశ్యం. ఆ సొమ్ముతో, దళితులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మార్గం సుగమం అవుతుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.
ఎటూ పథకం ప్రారంభమైపోయింది గనుక, ఏ రాజకీయ కోణం కూడా ఇకపై ఈ పథకాన్ని ఆపేందుకు ఆస్కారముండదు. ఎలాగూ, అధికారికంగా హుజూరాబాద్ నుంచి దళిత బంధు పథకాన్ని కేసీయార్ అంగరంగ వైభవంగా ప్రారంభిస్తారనుకోండి.. అది వేరే విషయం. కాగా, అనారోగ్యం కారణంగా పాదయాత్రను మధ్యలోనే ఆపేసిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్, హుజూరాబాద్ నియోజకవర్గంలో గెలిచేందుకోసం సీఎం కేసీయార్ ఇప్పటికే 150 కోట్లు ఖర్చు చేశారని ఆరోపిస్తుండడం గమనార్హం. ఈటెల రాజేందర్ ఎంతలా గగ్గోలు పెట్టినా ప్రయోజనం లేదిక. కేసీయార్ అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపుకి మార్గం సుగమం చేశారు. ఇప్పడిక ఈటెల రాజేందర్ రాజకీయ భవిష్యత్తు ఏంటి.? అధికార పక్షంపై విపక్షాలు పన్నబోయే నయా వ్యూహాలు ఎలా వుంటాయి.? వేచి చూడాల్సిందే.